హైదరాబాద్‌లో పెరిగిన హైరింగ్

21 Jan, 2015 02:25 IST|Sakshi
హైదరాబాద్‌లో పెరిగిన హైరింగ్

నౌకరీ జాబ్‌స్పీక్ ఇండెక్స్ వెల్లడి
హైదరాబాద్, సాక్షి: హైదరాబాద్‌లో ఉద్యోగాల భర్తీ దాదాపు 20 శాతం పెరిగింది. 2013 డిసెంబరు నుంచి 2014 డిసెంబరు మధ్య దేశవ్యాప్తంగా ఉద్యోగాల భర్తీ తీరును విశ్లేషించినపుడు ఈ విషయం వెల్లడైనట్లు జాబ్స్ వెబ్‌సైట్ నౌకరీ డాట్‌కామ్‌కు చెందిన నౌఖరీ జాబ్ స్పీక్ తెలియజేసింది. మొత్తమ్మీద అన్ని నగరాలనూ పోలిస్తే పుణె 30 శాతం, చెన్నై 29 శాతంతో తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. హైదరాబాద్‌ది ఆ తరువాతి స్థానం కాగా... బెంగళూరు 17%, ముంబయి 11%, కోల్‌కత 10%తో ఆ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీ మాత్రం 1 శాతం భర్తీ పెరుగుదలతో ఆఖర స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
 
ఇక రంగాల వారీ చూస్తే టెలికంలో 12% తగ్గుదల కనిపించగా చమురు-గ్యాస్ 27%, బ్యాంకింగ్ 17%, ఐటీ 12% వృద్ధితో తొలి 3 స్థానాల్లో ఉన్నాయి. ఏ కంపెనీలో చూసినా ఫైనాన్స్ విభాగంలో 21%, హెచ్‌ఆర్ విభాగంలో 20%, ఐటీ విభాగంలో 18% భర్తీలో పెరుగుదల నమోదైనట్లు జాబ్‌స్పీక్ ఇండెక్స్ వెల్లడిచింది. మొత్తమ్మీద ఉద్యోగాల భర్తీలో 10% వృద్ధి నమోదైనట్లు ఈ ఇండెక్స్ వెల్లడించింది.
 
ఐటీ సెక్టార్‌లో అధిక వేతనాలు
న్యూఢిల్లీ: దేశంలోనే లాభదాయకమైన రంగంగా ఐటీ సెక్టార్ ఆవిర్భవించింది. ఈ రంగంలో ఉద్యోగులు కనీసం గంటకు రూ.291 లను జీతంగా పొందుతున్నారు. ఇది సగటున గంటకు రూ.341గా ఉంది. ఇది ఇతర రంగాలతో పోలిస్తే చాలా ఎక్కువ. అలాగే పురుషులతో పోలిస్తే మహిళలు 34 శాతంమేర తక్కువ జీతాల్ని పొందుతున్నారు.

ఈ విషయాన్ని ఆన్‌లైన్ కెరీర్, నియామకాల సొల్యూషన్స్ ప్రొవైడర్ మాన్‌స్టర్ ఇండియా పేర్కొంది. దీని ప్రకారం నిర్మాణ రంగంలో ఉద్యోగుల సగటు జీతాలు గంటకు రూ.259, హెల్త్ కేర్ రంగంలో రూ.215, తయారీ-రవాణా రంగాల్లో రూ.230గా ఉన్నాయి. విద్యా రంగంలోని ఉద్యోగులు చాలా తక్కువ జీతాల్ని (గంటకు రూ.186లు) పొందుతున్నారని తెలిపింది.

>
మరిన్ని వార్తలు