గామన్‌ చైర్మన్‌ పాస్‌పోర్టు స్వాధీనం చేసుకోండి

12 Oct, 2018 01:10 IST|Sakshi

పాస్‌పోర్ట్‌ అధికారుల్ని  కోరిన బ్యాంకులు

న్యూఢిల్లీ: ఇంజినీరింగ్‌ సంస్థ గామన్‌ ఇండియా భారీ స్థాయిలో రుణాలు డిఫాల్ట్‌ అయిన నేపథ్యంలో ఆ సంస్థ చైర్మన్‌ అభిజిత్‌ రాజన్‌ విదేశాలకు జారుకోకుండా పాస్‌పోర్టును జప్తు చేయాలని పాస్‌పోర్టు అధికారులను బ్యాంకులు కోరాయి. ఆయన పాస్‌పోర్టు వివరాలను కన్సార్షియంలో లీడ్‌ బ్యాంకరు.. అధికారులకు అందజేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. గామన్‌ ఇండియాకి ఇచ్చిన సుమారు రూ. 7,000 కోట్ల రుణాలు ప్రస్తుతం నిరర్ధక ఆస్తులుగా (ఎన్‌పీఏ) మారినట్లు వివరించాయి. మరోవైపు, ఈ వార్తలపై గామన్‌ ఇండియా వర్గాలు స్పందిచడానికి నిరాకరించాయి.  

విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోదీ వంటి డిఫాల్టర్లు దేశం విడిచి పారిపోయిన నేపథ్యంలో ఇలాంటి ఉదంతాలు మళ్లీ చోటుచేసుకోకుండా కేంద్రం ఆర్థిక నేరగాళ్ల పలాయన నిరోధక చట్టం చేసిన సంగతి తెలిసిందే. దీని కింద రూ.50 కోట్ల పైబడిన రుణాలు తీసుకున్న రుణగ్రహీతల పాస్‌పోర్ట్‌ వివరాలు కూడా తీసుకోవాలంటూ ప్రభుత్వ రంగ బ్యాంకులను కేంద్రం ఆదేశించింది. ఒకవేళ సదరు రుణగ్రహీతలు బాకీలు ఎగ్గొట్టి విదేశాలకు పరారయ్యే ఆలోచనలో ఉన్న పక్షంలో అడ్డుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇలా, దాదాపు రూ.270 కోట్ల మేర బాకీలు ఎగ్గొట్టిన ఇద్దరు లగ్జరీ కార్‌ బ్రాండ్‌ డీలర్లను వేరే దేశాలకు పారిపోకుండా గత నెలలో అధికారులు అడ్డుకోగలిగారు. 

మరిన్ని వార్తలు