కార్ల కంపెనీల డిస్కౌంట్‌ డ్రైవ్‌!

16 Mar, 2018 01:26 IST|Sakshi

కస్టమర్లను ఆకర్షించేందుకు భారీగా తగ్గింపు

అమ్మకాల పెంపే లక్ష్యం

డిస్కౌంట్లతో పాటు ఆకర్షణీయ ఆఫర్లు కూడా

డీలర్ల తాయిలాలూ అదనం

ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో నిల్వలను తగ్గించుకునే వ్యూహం  

కార్ల కంపెనీలు ఆఫర్లు, డిస్కౌంట్లతో ఊరిస్తున్నాయి. రూ.లక్షన్నర వరకూ డిస్కౌంట్‌నివ్వడమే కాకుండా పొడిగించిన వారంటీ, ఉచిత వాహన బీమా  వంటి ఆకర్షణీయమైన స్కీమ్‌లతో అమ్మకాలు పెంచుకోవాలనుకుంటున్నాయి. సాధారణంగా పండుగల సీజన్‌లో, సంవత్సరాంతాన  ఈ డిస్కౌంట్లను కంపెనీలు ఇస్తాయి. ఇప్పుడు ఈ డిస్కౌంట్లు ఇవ్వడానికి ప్రత్యేక కారణమే ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రయాణికుల వాహనాలు 8 శాతమే వృద్ధి చెందాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీంట్లో కార్ల అమ్మకాలు 3.6 శాతం మాత్రమే పెరిగాయి.

ఈ తాజా గణాంకాలను చూస్తే, వాహన విక్రయాలకు ముఖ్యంగా కార్ల విక్రయాలకు  సంబంధించి మరోసారి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా నిరాశాజనకమైన వృద్ధే చోటు చేసుకునే అవకాశాలున్నాయని పరిశ్రమ నిపుణులు భావిస్తున్నారు. దీన్నించి గట్టెక్కడం కోసం వాహన కంపెనీలు భారీ డిస్కౌంట్లను ఆఫర్‌ చేస్తున్నాయి. ముఖ్యంగా డిమాండ్‌ తక్కువగా ఉన్న కార్ల మోడళ్లపై అధిక ఆఫర్లను ప్రకటిస్తున్నాయి.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2017–18) ఈ నెల 31తో ముగుస్తుంది. ఈ నెలాఖరు కల్లా నిల్వలను వీలైనంతగా తగ్గించుకోవాలని డీలర్లు భావిస్తున్నారు. దీంతో కంపెనీలు ఇచ్చే డిస్కౌంట్లకు తోడు డీలర్లు కూడా ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తున్నారు. డీలర్లు ఇచ్చే డిస్కౌంట్లు నగరాన్ని బట్టి మారుతూ ఉంటాయి. సాధారణంగా డీలర్లు ఉచిత యాక్సెసరీలు, వెండి, బంగారు నాణేలు, వార్షిక మెయింటెనెన్స్‌ కాంట్రాక్టులపై డిస్కౌంట్‌ను, ఉచిత రిజిస్ట్రేషన్‌ వంటి ఆఫర్లనిస్తున్నారు.

టాటా డిస్కౌంట్‌.. .రూ. లక్ష వరకూ !
టాటా మోటార్స్‌ వివిధ ప్రయాణికుల వాహనాలపై భారీ డిస్కౌంట్లనిస్తోంది. ఈ నెలాఖరు వరకూ దేశవ్యాప్తంగా ఈ డిస్కౌంట్లు వర్తిస్తాయి. ప్రీమియమ్‌ ఎస్‌యూవీ హెక్సాపై రూ. లక్ష వరకూ ప్రయోజనాలను, జెస్ట్‌ సెడాన్‌పై రూ.65,000 వరకూ, సఫారీ స్ట్రోమ్‌పై రూ.80,000 వరకూ డిస్కౌంట్లను ఇస్తోంది. ఒక్క నెక్సాన్‌ మోడల్‌పై మినహా అన్ని టాటా మోటార్స్‌మోడళ్లపై రూ. 1 కే బీమా స్కీమ్‌ను కంపెనీ ఆఫర్‌ చేస్తోంది.

రూ. లక్ష తగ్గిన డస్టర్‌ ధర...
డస్టర్‌ మోడల్‌ ధరలను   ఫ్రాన్స్‌ కంపెనీ రెనో రూ. లక్ష తగ్గించింది. ఈ కంపెనీ పోర్ట్‌ఫోలియోలో అధికంగా అమ్ముడయ్యే మోడల్‌ ఇదే. ఈ ఎస్‌యూవీ తయారీలో స్థానికంగా తయారయ్యే విడిభాగాలను ఉపయోగించడం పెరగడంతో ఈ కంపెనీ డస్టర్‌ ధరను రూ. లక్ష తగ్గించింది. ఇక ఇప్పుడు తాజాగా రూ.40,000 డిస్కౌంట్‌ను ఆఫర్‌ చేస్తోంది. రూ.1కే వాహన బీమాను అందిస్తోంది. ఇక క్విడ్‌ మోడల్‌కు నాలుగేళ్ల వారంటీని ఇస్తోంది. అంతే కాకుండా 7.99 శాతం వడ్డీరేటుకే క్విడ్‌ వాహన కొనుగోలుకు రుణాలనిస్తోంది.  

ఇక జర్మనీ కార్ల దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్‌ తన వెంటో మోడల్‌పై రూ.1.2 లక్షల వరకూ ప్రయోజనాలను అందిస్తోంది. దీంట్లో నేరుగా రూ.25,000 నగదు డిస్కౌంట్‌ కూడా ఉంది. ఇక అమియో సెడాన్‌పై రూ.70,000 వరకూ ప్రయోజనాలనందిస్తోంది. దీంట్లో కూడా నేరుగా రూ.25,000 నగదు డిస్కౌంట్‌నిస్తోంది. పోలో కారు కొంటే రూ.25,000 క్యాష్‌ డిస్కౌంట్‌తో పాటు రూ.45,000 ఇతర ప్రయోజనాలు కూడా పొందవచ్చు.   

మారుతీ డిస్కౌంట్స్‌ తక్కువే..
దేశంలో అత్యధికంగా కార్లు విక్రయించే మారుతీ సుజుకీ కంపెనీ తక్కువ డిస్కౌంట్లనిస్తోంది. ఈ కంపెనీ మార్కెట్లోకి తెచ్చిన మోడళ్లు... బాలెనో, స్విఫ్ట్, డిజైర్, బ్రెజా, ఎస్‌ –క్రాస్‌లకు వినియోగదారుల నుంచి మంచి స్పందన లభిస్తుండటంతో ఈ కార్లపై ఈ కంపెనీ ఎలాంటి డిస్కౌంట్లనివ్వడం లేదు. కొన్ని పాత మోడళ్లపై మాత్రం డిస్కౌంట్లను ప్రకటిస్తోంది. వేగన్‌–ఆర్‌ మోడల్‌పై రూ.30,000 నగదు డిస్కౌంట్‌ను, రూ.35,000 ఎక్స్చేంజ్‌ బోనస్‌ను అందిస్తోంది.

అలాగే సియాజ్‌ సెడాన్‌ మోడల్‌పై రూ.30,000 డిస్కౌంట్‌ను, రూ.50,000 ఎక్స్చేంజ్‌ బోనస్‌ను, ఎర్టిగపై రూ.20,000 డిస్కౌంట్‌ను, రూ45,000 ఎక్స్చేంజ్‌ బోనస్‌ను ఆఫర్‌ చేస్తోంది.  ఇక హ్యుందాయ్‌ కంపెనీ గ్రాండ్‌ఐ10పై రూ.35,000 క్యాష్‌ డిస్కౌంట్‌ను,  అంతేమొత్తంలో ఎక్స్చేంజ్‌ బోనస్‌ను అందిస్తోంది. ఈయాన్‌ పై రూ.30,000 నగదు డిస్కౌంట్‌తో పాటు రూ.10,000 ఎక్స్చేంజ్‌ బోనస్‌ను ఆఫర్‌ చేస్తోంది.

ఇలీట్‌ ఐ20, క్రెటా, వెర్నాలపై ఎలాంటి డిస్కౌంట్లను ఈ కంపెనీ ఆఫర్‌ చేయడం లేదు.  హోండా కూడా భారీ  డిస్కౌంట్‌లనే ఇస్తోంది. జాజ్‌ మోడల్‌పై రూ.30,000 డిస్కౌంట్‌తో పాటు ఒక ఏడాది ఉచిత బీమాను ఆఫర్‌ చేస్తోంది. ఇక సీఆర్‌–వీ మోడల్‌పై భారీగా రూ.లక్షన్నర వరకూ డిస్కౌంట్‌నిస్తోంది. వీటికి అదనంగా డీలర్లు కూడా భారీగానే డిస్కౌంట్లను ఇస్తున్నారు. 

మరిన్ని వార్తలు