కారు బీమా... ప్రీమియం తగ్గాలా?

23 Feb, 2014 01:03 IST|Sakshi
కారు బీమా... ప్రీమియం తగ్గాలా?

అమితాబ్ జైన్,హెడ్ కస్టమర్ సర్వీస్, ఐసీఐసీఐ లాంబార్డ్
 
 
 కొన్ని ఖర్చులు తగ్గించుకోలేం. అలాగని తప్పించుకోలేం కూడా. కానీ కారు ఇన్సూరెన్స్ అలా కాదు. బీమా కవరేజీలో రాజీపడకుండానే, ప్రీమియంను తగ్గించుకునే మార్గాలున్నాయి. అవేమిటో ఒకసారి చూద్దాం.
 
 

ఆన్‌లైన్లో కొనండి: మీ కారుకు తగిన ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్లో కొనడం వల్ల సంబంధిత బీమా కంపెనీకో, ఏజెంటు వద్దకో వెళ్లాల్సిన అవసరం తప్పుతుంది. కొంత సొమ్ము కూడా ఆదా అవుతుంది. బీమా కంపెనీలు తమ వెబ్‌సైట్ల నుంచి నేరుగా పాలసీ కొనుగోలు చేసే వారిని ప్రోత్సహించేందుకు ఆకర్షణీయమైన ఆఫర్లను, ప్రీమియం రేట్లను అందిస్తున్నాయి. ఆ కంపెనీ ఆఫర్ చేస్తున్న రేట్లను ఇతర కంపెనీల రేట్లతో పోల్చిచూసుకునే అవకాశం కూడా ఉంది. దీంతో మీ బడ్జెట్‌కు అన్ని విధాలా తగిన పాలసీని ఎంచుకోవచ్చు.
 
 

డిడక్టబుల్స్: వాహన యజమాని భరించే ఆర్థిక నష్టాన్నే డిడక్టబుల్‌గా పిలుస్తారు. ఇది రెండు రకాలు. 1. కంపల్సరీ డిడక్టబుల్ 2. వాలంటరీ డిడక్టిబుల్. కంపల్సరీ డిడక్టిబుల్ అంటే మీ కారుకు ఏదైనా నష్టం జరిగినపుడు ముందుగా నిర్ణయించిన మొత్తాన్ని మీరు భరించాలి. మిగిలిన సొమ్మును బీమా కంపెనీ చెల్లిస్తుంది. బీమా ప్రీమియంను తగ్గించుకోవాలనుకునే వారు వాలంటరీ డిడక్టబుల్‌ను ఎంచుకోవచ్చు. క్లెయిమ్ చేసిన మొత్తంలో కొంత భాగాన్ని మీరు స్వచ్ఛందంగా భరించడానికి అంగీకరించడమే వాలంటరీ డిడక్టబుల్. దీన్ని ఎంచుకుంటే ప్రీమియం ఇంకాస్త తగ్గుతుంది.
 
 

ఎన్‌సీబీని తీసుకోండి: ఎన్‌సీబీ అంటే నో క్లెయిమ్ బోనస్. గడిచిన సంవత్సరాల్లో మీరు గనక ఎలాంటి క్లెయిమూ చేయకుండా ఉంటే అందుకు కొంత బోనస్ లభిస్తుంది. ఆ మేరకు బీమా కంపెనీలు ప్రీమియంపై కొంత డిస్కౌంట్ ఇస్తాయి. ఎన్‌సీబీ 10 శాతంతో మొదలై 50 శాతం వరకు ఏటేటా పెరుగుతూ ఉంటుంది. ప్రీమియంను తగ్గించుకోవడమే కాదు, కొత్తగా కొనే కారుకు కూడా ఎన్‌సీబీని బదిలీ చేయవచ్చు.
 
 యాంటీ థెఫ్ట్ పరికరాలు అమర్చాలి: ఇటీవల కారు చోరీలు తీవ్రమైపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నష్టం తగ్గించడంలో బీమా కీలకపాత్ర పోషిస్తుంది. చోరీల నివారణకు కారులో యాంటీ థెఫ్ట్ పరికరాలు ఏర్పాటు చేయడం ఎంతైనా అవసరం. వీటిని ఏర్పాటు చేసుకునేవారికి బీమా కంపెనీలు ప్రీమియంపై ప్రత్యేక డిస్కౌంటు ఇస్తున్నాయి.
 
 సరైన ఐడీవీ: కారు కొన్న నాటి నుంచి కాలం గడిచే కొద్దీ దాని విలువ తగ్గుతుంది. అనుకోని సంఘటనలో కారు పూర్తిగా ధ్వంసమైపోయి, రీప్లేస్ చేయాల్సి వస్తే బీమా కంపెనీ చెల్లించే గరిష్ట మొత్తాన్నే ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ (ఐడీవీ) అంటారు. అధిక మొత్తాన్ని ఆశించే వారు ఎక్కువ ఐడీవీని కోరుతుంటారు. ఎక్కువ ఐడీవీని తీసుకోవాలంటే అధిక ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. కనుక, సహేతుకమైన ఐడీవిని ఆశిస్తే ప్రీమియం కూడా తగ్గుతుంది.
 

మరిన్ని వార్తలు