కొత్త కార్లలో హ్యాండ్‌ బ్రేక్‌ లివర్‌ మాయం

14 Sep, 2019 18:27 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అభివద్ధి చెందుతున్నా కొద్దీ కార్లు నడపడం చాలా సులువు అవుతూ వస్తోంది. ఇప్పటికే చాలా కార్లలో గేర్‌కు బదులుగా ఆటో గేర్‌ సిస్టమ్‌ వచ్చిన విషయం తెలిసిందే. మొన్నటి వరకు హ్యాండ్‌ బ్రేక్‌ను మాత్రం డ్రైవరే వేయాల్సి వచ్చేది. ఆ విధానానికి స్వస్తి చెబుతూ మొట్టమొదటి సారిగా జాగ్వర్‌ కార్లలో బటన్‌ సిస్టమ్‌ వచ్చింది. బటన్‌ నొక్కితే చాలు హాండ్‌ బ్రేక్‌ దానంతట అదే పడిపోతోంది. జాగ్వర్‌ కార్లను స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడు ల్యాండ్‌ రోవర్, లెక్సెస్, మెర్సిడెస్‌ బెంజి, పోర్షే ఖరీదైన కార్లు కూడా పుష్‌ బటన్‌ సిస్టమ్‌ను తీసుకొచ్చాయి.

ఆన్‌లైన్‌ మార్కెట్‌లో అందుబాటులో ఉన్న 32 కార్ల కంపెనీల వాహనాలను అధ్యయనం చేయగా ఇప్పటికే జాగ్వర్, ల్యాండ్‌ రోవర్, లెగ్సస్, మెర్సిడెస్, పోర్షే కార్లలో హ్యాండ్‌ బ్రేక్‌ లివర్‌ పూర్తిగా కనుమరుగైంది. ఇక షో రూముల్లో పరిశీలిస్తే ప్రతి పది కంపెనీల కార్లలో మూడు కంపెనీల కార్లలో మాత్రమే ఇంకా హ్యాండ్‌ బ్రేక్‌ వ్యవస్థ ఉంది. డేషియా, సుజికీ కంపెనీలు మాత్రం ఇప్పటికీ హ్యాండ్‌ బ్రేకర్ల వ్యవస్థనే ఉపయోగిస్తున్నాయి. హ్యాండ్‌ బ్రేక్‌ వేసి ఉందా, లేదా అన్న విషయం డాష్‌ బోర్డులో రెడ్‌ మార్కుతో కనిపిస్తుంది. 

హ్యాండ్‌ బ్రేకుల్లో కూడా ఆటోమేటిక్‌ వ్యవస్థ వస్తోంది. కొండలు, గుట్టలు ఎక్కుతున్నప్పుడు ఈ వ్యవస్థ ఎక్కువగా ఉపయోగపడుతుంది. కొండ ఎక్కుతున్నప్పుడు కారు ముందుకు పోలేక వెనక్కి జారుతున్నప్పుడు ఈ ఆటోమేటిక్‌ వ్యవస్థ పనిచేసి హ్యాండ్‌ బ్రేక్‌ దానంతట అదే పడుతుంది. డ్రైవర్‌ అవసరం లేని సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కార్లు వస్తోన్న నేపథ్యంలో డ్రైవర్‌ మరింత సులువుగా కార్లు నడిపే దిశగా ముమ్మర పరిశోధనలు జరుగుతున్నాయి. 

మరిన్ని వార్తలు