రోడ్లపై కార్ల జోరు!

11 Jul, 2018 00:18 IST|Sakshi

జూన్‌లో వాహన విక్రయాలు 38% జంప్‌

2,73,759 యూనిట్లుగా నమోదు

పదేళ్లలో ఇదే అత్యంత వేగవంతమైన నెలవారీ వృద్ధి

సియామ్‌ గణాంకాల్లో వెల్లడి

న్యూఢిల్లీ: వాహన పరిశ్రమ జోరుమీదుంది. జూన్‌ నెలలో ప్యాసింజర్‌ వాహన అమ్మకాల్లో 38 శాతం వృద్ధి నమోదయ్యింది. అటుఇటుగా గత పదేళ్లలో ఇదే అత్యంత వేగవంతమైన నెలవారీ వృద్ధి. ఆటోమొబైల్‌ మ్యానుఫ్యాక్చరర్స్‌ సమాఖ్య (సియామ్‌) తాజా గణాంకాల ప్రకారం..  

దేశీ ప్యాసింజర్‌ వాహన (పీవీ) అమ్మకాలు 1,99,036 యూనిట్ల నుంచి 2,73,759 యూనిట్లకు పెరిగాయి. 2009 డిసెంబర్‌ నాటి 50 శాతం వృద్ధి తర్వాత ఇదే అత్యంత వేగవంతమైన నెలవారీ వృద్ధి.  
   దేశీ కార్ల విక్రయాలు 34.21 శాతం వృద్ధి చెందాయి. ఇవి 1,37,012 యూనిట్ల నుంచి 1,83,885 యూనిట్లకు పెరిగాయి.  
 ‘జీఎస్‌టీ అమలు నేపథ్యంలో ధరల తగ్గింపు ఉంటుందనే అంచనాలతో ప్రజలు గతేడాది ఇదే నెలలో కొనుగోళ్లను వాయిదా వేసుకున్నారు. దీనివల్ల ప్రస్తుతం వృద్ధి రేటు పెరిగింది’ అని సియా మ్‌ డైరెక్టర్‌ జనరల్‌ విష్ణు మాథూర్‌ తెలిపారు.  
 యుటిలిటీ వెహికల్స్, వ్యాన్ల విక్రయాల్లో వరుసగా 47.11 శాతం, 35.64 శాతం వృద్ధి నమోదయ్యింది.  
   మారుతీ సుజుకీ దేశీ ప్యాసింజర్‌ వాహన అమ్మకాలు 44.4 శాతం వృద్ధితో 1,34,036 యూనిట్లకు, హ్యుందాయ్‌ మోటార్‌ విక్రయాలు 20.79 శాతం వృద్ధితో 45,371 యూనిట్లకు పెరిగాయి. మహీంద్రా అండ్‌ మహీంద్రా విక్రయాలు 11.89 శాతం వృద్ధితో 18,092 యూనిట్లకు, టాటా మోటార్స్‌ పీవీ అమ్మకాలు 56.75 శాతం వృద్ధితో 20,610 యూనిట్లకు ఎగశాయి.  
   మొత్తం టూవీలర్‌ విక్రయాల్లో 22.28 శాతం వృద్ధి నమోదయ్యింది. 18,67,884 యూనిట్లకు పెరిగాయి.  
   మోటార్‌ సైకిల్‌ అమ్మకాలు 24.32 శాతం వృద్ధితో 11,99,332 యూనిట్లకు ఎగశాయి. హీరో మోటొకార్ప్‌ దేశీ మోటార్‌ సైకిల్‌ విక్రయాలు 16.56 శాతం పెరిగాయి. 6,26,194 యూనిట్లుగా నమోదయ్యాయి. హోండా మోటార్‌ సైకిల్‌ అమ్మకాలు 19.89 శాతం వృద్ధితో 1,74,276 యూనిట్లకు పెరిగాయి. బజాజ్‌ ఆటో విక్రయాలు ఏకంగా 85.87 శాతం వృద్ధితో 2,00,949 యూనిట్లకు ఎగశాయి.  
    స్కూటర్‌ విక్రయాలు 20.96 శాతం వృద్ధితో 6,01,761 యూనిట్లకు చేరాయి. హోండా మోటార్‌సైకిల్‌ దేశీ స్కూటర్‌ అమ్మకాలు 33.29 శాతం వృద్ధి చెందాయి. 3,61,236 యూనిట్లుగా నమోదయ్యాయి. టీవీఎస్‌ మోటార్స్‌ విక్రయాలు 14.84 శాతం వృద్ధితో 99,107 యూనిట్లకు పెరిగాయి. హీరో మోటొకార్ప్‌ స్కూటర్‌ అమ్మకాలు 15.53 శాతం క్షీణతతో 63,755 యూనిట్లకు తగ్గాయి.  
   వాణిజ్య వాహన అమ్మకాలు 41.72 శాతం వృద్ధితో 80,624 యూనిట్లకు ఎగశాయి.  

>
మరిన్ని వార్తలు