కార్ల ధరలు పెరుగుతున్నాయ్‌..!

12 Dec, 2017 00:51 IST|Sakshi

టాటా పెంపు రూ.25,000 వరకూ..

వచ్చే నెల నుంచి ఈ పెరుగుదల వర్తింపు

న్యూఢిల్లీ: కార్ల ధరలు వచ్చే నెల నుంచి పెరగనున్నాయి. పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాలను తట్టుకోవడానికి ధరలను పెంచక తప్పడం లేదని కంపెనీలు చెబుతున్నాయి. ధరలు పెంచుతున్నామని ఇప్పటికే టయోటా, హోండా, స్కోడా, ఇసుజు  కంపెనీలు  ప్రకటించాయి. ఇక తాజాగా టాటా మోటార్స్, ఫోర్డ్‌   కూడా ధరలు పెంచనున్నట్లు వెల్లడించాయి.

ప్రయాణికుల వాహనాల ధరలను రూ.25,000 వరకూ పెంచనున్నామని టాటా మోటార్స్‌ ప్రెసిడెంట్‌ (ప్యాసింజర్‌ వెహికల్‌ బిజినెస్‌) మయాంక్‌ పరీక్‌ చెప్పారు. మారుతున్న మార్కెట్‌ పరిస్థితులు, పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాలు, ఇతర ఆర్థిక కారణాల వల్ల ధరలను పెంచక తప్పడం లేదని వివరించారు. ఇటీవల మార్కెట్లోకి తెచ్చిన నెక్సన్‌ ఎస్‌యూవీ పరిచయ ధరలు ఈ నెల 31 వరకూ మాత్రమే చెల్లుబాటవుతాయని, వచ్చే నెల 1 నుంచి ఈ వాహనాల ధరలు రూ.25,000 వరకూ పెరుగుతాయని వివరించారు. 

ఫోర్డ్‌ పెంపు 4 శాతం వరకూ...: ఫోర్డ్‌ ఇండియా కంపెనీ తన కార్ల ధరలను 4 శాతం వరకూ పెంచుతోంది. కమోడిటీ ధరల్లో తీవ్రమైన ఒడిదుడుకులు, పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాలు, రవాణా వ్యయాలు పెరగడం వల్ల తప్పనిసరిగా ధరలను పెంచవలసి వస్తోందని ఫోర్డ్‌ ఇండియా ఈడీ(మార్కెటింగ్‌ సేల్స్‌ అండ్‌ సర్వీస్‌) వినయ్‌ రైనా చెప్పారు.

పెరుగుతున్న ఈ వ్యయాలన్నింటినీ అధిక భాగం తామే భరిస్తున్నామని, వినియోగదారులపై మరీ భారం పడకుండా 4 శాతానికి మించి ధరలను పెంచకూడదని నిర్ణయించామని పేర్కొన్నారు. ఇటీవల మార్కెట్లోకి తెచ్చిన ఫోర్డ్‌ ఎకోస్పోర్ట్‌తో సహా అన్ని ఫోర్డ్‌ మోడళ్లకు ధరల పెంపు వర్తిస్తుందని వివరించారు.

మరిన్ని వార్తలు