పుంజుకున్న ప్యాసింజర్‌ వెహికల్స్‌ అమ్మకాలు

10 Nov, 2018 01:47 IST|Sakshi

అక్టోబర్లో 1.55 శాతం పెరుగుదల

3 వరుస నెలల క్షీణతకు విరామం

న్యూఢిల్లీ: దేశీయంగా ప్రయాణికుల వాహన (ప్యాసింజర్‌ వెహికల్స్‌/కార్లు, జీపులు) విక్రయాలు అక్టోబర్‌ నెలలో పర్వాలేదనిపించాయి. వరుసగా మూడు నెలల క్షీణత తర్వాత అక్టోబర్‌లో అమ్మకాలు పుంజుకున్నాయి. 1.55 శాతం మేర వృద్ధి నమోదైనట్టు ఆటోమొబైల్‌ తయారీదారుల సంఘం (సియామ్‌) తెలిపింది. గణాంకాలను పరిశీలిస్తే... అక్టోబర్‌లో ప్యాసింజర్‌ వెహికల్స్‌ విక్రయాలు 2,84,224 యూనిట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే మాసంలో అమ్ముడైనవి 2,79,877 కావడం గమనార్హం.

ఈ ఏడాది జూలైలో అమ్మకాలు 2.71 శాతం, ఆగస్ట్‌లో 2.46 శాతం, సెప్టెంబర్‌లో ఏకంగా 5.61% చొప్పున తగ్గిపోయాయి. అక్టోబర్‌లో విక్రయాలు పుంజుకోవడంతో వాహన కంపెనీలు ఊపిరిపీల్చుకున్నాయి. అన్ని విభాగాల్లోనూ అమ్మకాలను కలిపి చూస్తే అక్టోబర్‌లో 15.33% వృద్ధితో 24,94,426 యూనిట్లకు చేరాయి. క్రితం ఏడాది అక్టోబర్‌లో అమ్మకాలు 21,62,869 యూనిట్లే కావడం గమనార్హం. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌–అక్టోబర్‌ వరకు చూసుకుంటే ప్యాసింజర్‌ వెహికల్స్‌ విక్రయాలు 6.10% పెరిగాయి. 20,28,529 లక్షల వాహనాలు అమ్ముడుపోయాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్ముడైనవి 19,11,883గానే ఉన్నాయి. 

మరిన్ని వార్తలు