వాహన విక్రయాలకు ఎక్సైజ్ దెబ్బ

3 Feb, 2015 03:43 IST|Sakshi
వాహన విక్రయాలకు ఎక్సైజ్ దెబ్బ

* జనవరి గణాంకాలు విడుదల...
* బడ్జెట్‌పై కంపెనీల ఆశలు

న్యూఢిల్లీ:  వాహన విక్రయాలు ఈ ఏడాది జనవరిలో మిశ్రమంగా ఉన్నాయి.  కంపెనీలు ధరలను పెంచడం, ఎక్సైజ్ సుంకం రాయితీలు తొలగించడం వంటి అంశాలు మొత్తం విక్రయాల(దేశీయ విక్రయాలు, ఎగుమతులు)పై ప్రభావం చూపాయి. అయితే ధరలు పెరిగినప్పటికీ, ఎక్సైజ్ సుంకం రాయితీలు తొలగించినప్పటికీ  దేశీయ విక్రయాలు పుంజుకున్నాయని పరిశ్రమ వర్గాలంటున్నాయి.

మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, హోండా కార్స్, అశోక్ లేలాండ్, యమహా, టీవీఎస్, హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా, రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీల అమ్మకాలు పెరిగాయి. మహీంద్ర అండ్ మహీంద్ర, జనరల్ మోటార్స్, ఫోర్డ్, బజాజ్ ఆటో విక్రయాలు మాత్రం తగ్గాయి. టాటా మోటార్స్, హోండా కార్స్ ఇండియా కంపెనీలు రెండంకెల వృద్ధిని సాధించాయి. ఎక్సైజ్ సుంకం రాయితీల తొలగింపు డిమాండ్‌పై ప్రభావం చూపిందని పరిశ్రమ వర్గాలు చెప్పాయి.

అధికంగా ఉన్న వడ్డీరేట్లు, బలహీనంగా ఉన్న ఆర్థిక పరిస్థితులు కూడా అమ్మకాలపై ప్రభావం చూపాయని ఆ వర్గాలు వెల్లడించాయి. వడ్డీరేట్లు మరింత తగ్గించాలని, పన్నులను హేతుబద్ధీకరించాలని, ఇలా చేస్తే మొదటిసారిగా కార్లను కొనుగోలు చేసే వారి సంఖ్య మరింతగా పెరుగుతుందని హ్యుందాయ్ రాకేశ్ శ్రీవాత్సవ పేర్కొన్నారు.  రానున్న బడ్జెట్లో వినియోగదారులకు ప్రయోజనకరమైన, పరిశ్రమకు అనుకూలమైన సంస్కరణలు ప్రభుత్వం తెస్తుందన్న ఆశాభావాన్ని ఫోర్డ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్(మార్కెటింగ్) మెహరోత్ర చెప్పారు.

>
మరిన్ని వార్తలు