డిమాండ్‌ను మించి హోటల్స్

18 Apr, 2014 01:12 IST|Sakshi
రాడిసన్ హోటల్స్

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశ ఆతిథ్య రంగం ఇంకా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఆర్థిక వృద్ధిరేటు తగ్గడానికి తోడు డిమాండ్‌ను మించి హోటల్ గదులు అందుబాటులోకి రావడమే దీనికి ప్రధాన కారణమని రాడిసన్ హోటల్ పేర్కొంది. నాలుగేళ్ళ క్రితం దేశంలో బ్రాండెడ్ హోటల్ గదుల సంఖ్య 45,000గా ఉంటే ఇప్పుడు అది 1,10,000 దాటిందని, వచ్చే ఐదేళ్ళలో ఈ సంఖ్య 1.60 లక్షలు దాటుతుందని అంచనా వేస్తున్నట్లు కార్లిసన్ రెజిడర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సౌత్ ఏషియా) రాజ్ రాణా ‘సాక్షి’కి తెలిపారు.

 కాని దేశీయ పర్యాటక రంగం వేగంగా విస్తరిస్తుండటంతో భవిష్యత్తు బాగుంటుందని పరిశ్రమ అంచనా వేస్తోందని, ఎన్నికల తర్వాత స్థిరమైన ప్రభుత్వం వస్తే ఆతిథ్య రంగానికి పూర్వ వైభవం వస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. కార్లిసన్ రెజిడర్ హోటల్స్ ప్రపంచవ్యాప్తంగా రాడిసన్, రాడిసన్ బ్లూ ఐదు రకాల బ్రాండెడ్ హోటల్స్‌ను నిర్వహిస్తోంది. హైదరాబాద్‌లో హైటెక్ సిటీ సమీపంలో ఏర్పాటు చేసిన రెండో హోటల్‌ను గురువారం లాంఛనంగా ప్రారంభించారు.

గతంలో దీన్ని ఆదిత్య సరోవర్ ప్రీమియం హోటల్‌గా వ్యవహరించేవారు. ఈ సందర్భంగా రాణా ‘సాక్షి’తో మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా దేశీయ ఆతిథ్య రంగం ముఖ్యంగా రాష్ట్రంలో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోందని, ఇప్పుడు రాష్ట్ర విభజన అంశం ఒక కొలిక్కి రావడంతో కోలుకుంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశీయ హోటల్స్ సగటు ఆక్యుపెన్సీ రేషియా 60 శాతం వద్ద స్థిరంగా ఉందన్నారు. టారిఫ్‌లు, ఆక్యుపెన్సీ రేషియోలో ఇంకా ఎటువంటి వృద్ధి కనిపించడం లేదన్నారు. కాని ఈ మధ్యనే విదేశీ నిధుల ప్రవాహంతో పాటు విదేశీ ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండటం కొంత ఆశావహ వాతావరణం కనిపిస్తోందన్నారు.

 విశాఖలో రాడిసన్
 దక్షిణ భారతదేశంపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నట్లు కార్ల్‌సన్ రెజిడర్ హోటల్స్ ప్రకటించింది. ఇందులో భాగంగా విశాఖపట్నం, కొచ్చి, మైసూర్ వంటి పట్టణాల్లో కొత్తగా హోటల్స్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 66 హోటల్స్‌ను నిర్వహిస్తుండగా, 44 హోటల్స్ నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. ఏటా కొత్తగా 8-9 హోటల్స్‌ను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. దేశంలో బడ్జెట్ హోటల్స్‌కి డిమాండ్ బాగుండటంతో ఈ రంగంపై దృష్టి సారిస్తున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు