సీఏలు ‘ట్రూ అండ్ ఫెయిర్’గా ఉండాలి

24 Aug, 2014 00:46 IST|Sakshi
సీఏలు ‘ట్రూ అండ్ ఫెయిర్’గా ఉండాలి

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చార్టర్డ్ అకౌంటెంట్ సంతకం ఎంతో విలువైనదని, సామాన్యుని దగ్గర నుంచి రిజర్వ్ బ్యాంక్ వరకు అందరూ ఆ సంతకం ఆధారంగానే నిర్ణయాలు తీసుకుంటారని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డెరైక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) చైర్మన్ కె.వి.చౌదరి పేర్కొన్నారు. ఒక కంపెనీ బ్యాలెన్స్ షీట్‌ను నిర్ధారిస్తూ ఆడిటర్లు ‘ట్రూ అండ్ ఫెయిర్’ అని సంతకం చేస్తారని,  జీవితంలో కూడా సీఏలు అదే విధంగా వ్యవహరించినప్పుడే వృత్తి గౌరవం కాపాడినవారవుతారన్నారు. ఒకరిద్దరు చేసిన తప్పుల వల్ల మొత్తం వృత్తికే చెడ్డపేరు వస్తోందని, ఈ మధ్యకాలంలో బ్యాంకుల నుంచి నిధుల మళ్లింపుల కేసుల్లో పరోక్షంగా సీఏల పాత్ర కూడా ఉందంటూ చురకలు వేశారు.
 
ఐసీఏఐ హైదరాబాద్ బ్రాంచ్ ఎస్‌ఐఆర్‌సీ ప్రత్యక్ష పన్నులపై నిర్వహించిన ఒక రోజు సమావేశానికి చౌదరి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విచారణల పేరుతో సామాన్యులను భయపెట్టాలన్నది ఆదాయ పన్ను శాఖ లక్ష్యం కాదని, పన్ను చెల్లించకుండా ఎగ్గొడుతున్న వారే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఒక సంస్థ టీడీఎస్ వసూలు చేసి చెల్లించకపోతే దానివల్ల మొత్తంగా రిఫండ్స్ విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. ఇలాంటి సంస్థల విషయంలో చాలా కఠినంగా వ్యవ హరిస్తున్నామన్నారు.
 
గతేడాది సంయుక్త ఆంధ్రప్రదేశ్‌లో టీడీఎస్ వసూలు చేసి చెల్లించని 1,000 కేసులు గుర్తించినట్లు తెలిపారు. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో జరుగుతున్న డెవలప్‌మెంట్ ఒప్పందాల్లో పన్ను ఎగవేత ఎక్కువగా ఉంటోందన్న అంశం తమ దృష్టికి వచ్చిందని, దీన్ని అరికట్టడానికి బెంగళూరు కేంద్రంగా ఒక సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెండు రాష్ట్రాలకు చెందిన ఇన్‌కమ్ ట్యాక్స్ కమిషనర్లతో పాటు,  ఐసీఏఐ సెంట్రల్ కౌన్సిల్ సభ్యులు జె.వెంకటేశ్వర్లు, ఎం.దేవరాజ రెడ్డి, ప్రాక్టీసింగ్ సీఏలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు