వెక్కిరిస్తున్న ఏటీఎంలు: మరో మూడు రోజులు ఇంతే!

17 Apr, 2018 12:41 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  దేశ ప్రజలను మళ్లీ కరెన్సీ కష్టాలు పట్టి పీడిస్తున్నాయి.  ఎక్కడ చూసినా నో క్యాష్ బోర్డులు వెక్కిరిస్తున్నాయి. ఏటీఎంలలో నగదు లేక ..పెద్ద నోట్ల రద్దు సమయంలో నెలకొన్న పరిస్థితులు మళ్లీ పునరావృతమవడంతో  ప్రజలు  తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.  పలు రాష్ట్రాల్లో 30-40శాతం నగదు కొరత నెలకొనడంపై మండిపడుతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ర్టాల్లో ఏటీఎంలలో నగదు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  ముఖ్యంగా గత వారం రోజులనుంచి సమస్య మరీ తీవ్రంగా ఉందని ప్రజలు వాపోతున్నారు. ఏ ఏటీఎం వద్ద చూసినా నో క్యాష్ బోర్డులు దర్శనమిస్తున్నాయని తెలిపారు. నగదుకోసం  10నుంచి 15 ఏటీఎంల చుట్టూ తిరిగినా  ఫలితం శూన్యమని  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  మరోవైపు  ఈ కొరత తాత్కాలికమేననీ, మరో మూడు రోజుల్లో పరిస్థితి చక్కబడుతుందంటూ  చావు కబురు చల్లగా  చెప్పుకొచ్చింది  ప్రభుత్వం. 

ఈ కొరత  తాత్కాలికమేననీ త్వరలోనే  పరిస్థితి చక్కబడుతుందంటూ కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ  కొద్దిసేపటి క్రితం ట్విటర్‌లో వెల్లడించారు. దేశంలో కరెన్సీ పరిస్థితిని సమీక్షించామనీ సర్క్యులేషన్లో తగినంత కరెన్సీ ఉందనీ వెల్లడించారు. అలాగే అన్ని బ్యాంకులకు కూడా  సరిపడానగదు అందుబాటులో ఉందని పేర్కొన్నారు . కొన్ని ప్రాంతాల్లో 'ఆకస్మిక, అసాధారణ పెరుగుదల' కారణంగా ఏర్పడిన తాత్కాలిక కొరతను త్వరలోనే పరిష్కరిస్తామని ట్వీట్‌ చేశారు. అటు  పరిస్థితి త్వరలోనే చక్కబడుతుందనీ,  వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎస్‌బీఐ చైర్మన్‌ రజనీష్‌ కుమార్‌ మీడియా ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. డిజిటల్‌ ఎకానమీ పుంజుకుంటున్న నేపథ్యంలో చేతిలో డబ్బులు ఉంచుకోవాల్సిన అవసరం లేదంటూ ఆయన వ్యాఖ్యానించడం విశేషం.

ఇది ఇలా  ఉంటే  కొన్ని రాష్ర్టాల్లో నగదు సమస్య వాస్తవమేనని ఆర్థిక శాఖ సహాయ మంత్రి ఎస్పీ శుక్లా పేర్కొన్నారు. ప్రస్తుతం లక్షా ఇరవై ఐదు వేల కోట్ల కరెన్సీ చలామణిలో ఉందన్నారు. అయితే పలు రాష్ర్టాల్లో నగదు తక్కువగా ఉందనీ అంగీకరించిన ఆయన ప్రభుత్వం నగదు కొరతను తీర్చేందుకు రాష్ర్టాల వారీగా కమిటీలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. నగదు ఎక్కువగా ఉన్న రాష్ర్టాల నుంచి నగదు లేని రాష్ర్టాలకు డబ్బు తరలించేందుకు ఆర్‌బీఐ ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసిందని వెల్లడించారు.  నగదు కొరత సమస్య మూడు రోజుల్లో తీర్చుతామని శుక్లా స్పష్టం చేశారు. అటు నగదు సంక్షోభంపై సీపీఏం నేత ఏచూరి సీతారాం కూడా ట్విటర్‌లో ఆగ్రహాన్ని వ‍్యక్తం చేశారు.  

మరిన్ని వార్తలు