క్యాస్ట్రాల్ ఇండియాలో వాటా విక్రయించిన బీపీ

20 May, 2016 01:12 IST|Sakshi
క్యాస్ట్రాల్ ఇండియాలో వాటా విక్రయించిన బీపీ

డీల్ విలువ రూ.2,075 కోట్లు
న్యూఢిల్లీ:   క్యాస్ట్రాల్ ఇండియాలో 11.5 శాతం వాటాను ఇంగ్లండ్‌కు చెందిన బీపీ కంపెనీ విక్రయించింది. ఒక్కో షేర్‌ను రూ.365 చొప్పున 5.68 కోట్ల షేర్లను(11.5 శాతంవాటా)ను దేశీయ, అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు విక్రయించామని బీపీ కంపెనీ పేర్కొంది. ఈ వాటా విక్రయ విలువ రూ.2,075 కోట్లని వివరించింది. ఈ వాటా విక్రయాన్ని సిటి గ్రూప్ గ్లోబల్ మార్కెట్స్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్ సంస్థలు నిర్వహించాయి. ఈ డీల్ కారణంగా క్యాస్ట్రాల్ ఇండియా ఉద్యోగులు, వినియోగదారులు, ప్రస్తుత కాంట్రాక్టులపై ఎలాంటి ప్రభావం ఉండబోదని బీపీ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ బాబ్ డడ్లీ చెప్పారు.

వృద్ధికి అవకాశాలున్న  భారత్ తమకు కీలకమైన మార్కెటని, భారత్‌లో పెట్టుబడులు కొనసాగిస్తామని బీపీ ఇండియా హెడ్ శశి ముకుందన్ చెప్పారు. గతేడాది మంచి పనితీరు కనబరిచామని క్యాస్ట్రాల్ ఇండియా ఎండీ ఒమర్ డోర్‌మెన్ చెప్పారు. నికర లాభం 30 శాతం వృద్ధితో రూ.615 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. క్యాస్ట్రాల్ ఇండియాలో బీపీ సంస్థకు 70.92 శాతం వాటా ఉంది. వాటా విక్రయ నేపథ్యంలో క్యాస్ట్రాల్ ఇండియా షేర్ బీఎస్‌ఈలో 3.2 శాతం క్షీణించి రూ.373 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు