ఎగిసే మార్కెట్లలో.. ఆచితూచి పెట్టుబడి

29 Aug, 2016 00:45 IST|Sakshi
ఎగిసే మార్కెట్లలో.. ఆచితూచి పెట్టుబడి

మార్కెట్లు ఒక్కసారిగా ఎగిసేటప్పుడు.. పెట్టుబడి అవకాశాలు కోల్పోతామేమో అన్న ఆందోళనతో తొందరపడొద్దని ఇన్వెస్టర్లకు సూచించారు యూటీఐ అసెట్ మేనేజ్‌మెంట్ ఫండ్ మేనేజర్ అజయ్ త్యాగి. షేర్లు కొనుగోలు చేసేందుకు మధ్య మధ్యలో వచ్చే కరెక్షన్లను ఉపయోగించుకోవాలని ఆయన పేర్కొన్నారు. సాధారణంగా భారతీయ రిటైల్ ఇన్వెస్టర్లు.. మార్కెట్లు కాస్త గరిష్ట స్థాయిల్లో ఉన్నప్పుడు భారీ మొత్తాలు ఇన్వెస్ట్ చేస్తుంటారని, మార్కెట్లు ఏమాత్రం కరెక్షన్‌కు లోనైనా ఇన్వెస్ట్ చేయడానికి జంకుతుంటారని త్యాగి తెలిపారు. అయితే ఈక్విటీ మార్కెట్లు ఎప్పుడైనా సరే ఒక 5-10 శాతం మేర హెచ్చుతగ్గులకు లోనవుతూనే ఉంటాయన్నది ఇన్వెస్టర్లు గుర్తెరిగి వ్యవహరించాలని ఆయన సూచించారు.

ఇటీవలి ర్యాలీలో కొన్ని షేర్లను చూస్తే.. పీఈ (ప్రైస్ టు ఎర్నింగ్స్) నిష్పత్తికి దాదాపు ఇరవై రెట్లు అధిక స్థాయికి చేరాయని, మార్కెట్లు ఈ స్థాయిలో పెరిగినప్పుడు అకస్మాత్తుగా కరెక్షన్లకు లోనవడానికి అవకాశాలు ఎక్కువగానే ఉంటాయని త్యాగి పేర్కొన్నారు. ఇక, బ్యాంకుల విషయానికొస్తే... మొండిబకాయిలు మొదలైన వాటి నేపథ్యంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌బీ)పై ప్రతికూల ధోరణే ఉందని ఆయన చెప్పారు. రాబోయే సంవత్సరాల్లో ప్రైవేట్ రంగ బ్యాంకులు నిధులు సమీకరించి.. వృద్ధికి వినియోగించుకోనుండగా.. పీఎస్‌బీలు తాము సమీకరించే నిధులను ఖాతాల ప్రక్షాళనకు ఉపయోగించుకోవాల్సి రావొచ్చని త్యాగి తెలిపారు.

మరిన్ని వార్తలు