ఎఫ్‌పీఐలు కార్పొరేట్లలా మారొచ్చు!

11 Jul, 2019 04:40 IST|Sakshi
ఆదాయపన్ను సర్‌చార్జీ, ఎఫ్‌పీఐలు, సీబీడీటీ, పీసీ మోడీ

చెల్లించే స్తోమత ఉంది కనుకే వారిపై పన్నుభారం

‘సర్‌చార్జీ’పై సీబీడీటీ చైర్మన్‌ పీసీ మోడీ వ్యాఖ్య 

న్యూఢిల్లీ: ఆదాయపన్ను సర్‌చార్జీ పెంపు నుంచి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లకు (ఎఫ్‌పీఐలు) మినహాయింపు ఇవ్వటానికి అవకాశం లేదని ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) చైర్మన్‌ పీసీ మోడీ స్పష్టం చేశారు. ఎఫ్‌పీఐలు కావాలనుకున్న పక్షంలో కార్పొరేట్‌ సంస్థగా రిజిస్టర్‌ చేసుకుని, ఆ విభాగంలో ఉన్న తక్కువ రేట్ల పరిధిలోకి మారొచ్చని సూచించారు. రూ.2 కోట్లపైన ఆదాయం కలిగిన వారిపై సర్‌చార్జ్‌ పెంచాలన్న నిర్ణయాన్ని... దేశ నిర్మాణం కోసం వారు మరింత చెల్లించగలరన్న ఉద్దేశంతోనే తీసుకున్నామన్నారు. ‘‘బేస్‌ రేటులో మార్పు లేదు. మారింది సర్‌చార్జీ మాత్రమే. ఇది ఎఫ్‌పీఐలు, ఆల్టర్నేటివ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్స్‌పై (ఏఐఎఫ్‌) ప్రభావం చూపిస్తుంది. కానీ, కార్పొరేట్‌ సంస్థగా మారే ఆప్షన్‌ వారికి ఉంది.

ఈ విషయంలో ఏవిధమైన భేదభావం లేదు’’ అని సీఐఐ నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా మోదీ పేర్కొన్నారు. ఆదాయపన్ను పరిధిలో దిగువ స్థాయిల్లో ఉన్న వారికి ప్రయోజనాలు అందించేందుకు అధికాదాయ వర్గాలపై సర్‌చార్జీ పెంచినట్టు మోడీ తెలిపారు. బడ్జెట్‌ 2019–20లో అధిక ఆదాయం కలిగిన వారిపై సర్‌చార్జీలను పెంచుతూ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రతిపాదించిన విషయం విదితమే. రూ.2–5 కోట్ల మధ్య ఆదాయం ఉన్న వారిపై సర్‌చార్జీని 25 శాతానికి, రూ. 5 కోట్లు దాటిన వారిపై 37 శాతానికి పెంచేశారు. దాదాపు 40 శాతం మంది ఎఫ్‌పీఐలు నాన్‌ కార్పొరేట్‌ సంస్థల రూపంలో అసోసియేషన్‌ ఆఫ్‌ పర్సన్‌ లేదా ట్రస్ట్‌గా ఇన్వెస్ట్‌ చేస్తున్నందున వారిపై తప్పనిసరిగా ఈ భారం పడనుంది. ఎందుకంటే ఆదాయపు పన్ను చట్టం ప్రకారం వారిని వ్యక్తులుగానే పరిగణిస్తున్నారు.

పన్నుల లక్ష్యాన్ని చేరుకుంటాం..
ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ప్రత్యక్ష పన్నుల వసూళ్ల లక్ష్యాన్ని రూ.13.35 లక్షల కోట్లకు సవరించామని, ఇది ఆచరణ సాధ్యమేనని పీసీ మోడీ తెలిపారు. కార్పొరేట్‌ పన్ను మరింత తగ్గించే అంశాన్ని, ఈ రంగంలో మినహాయింపులు, తగ్గింపులన్నవి తొలగిపోయిన తర్వాతే ప్రభుత్వం పరిశీలించగలదన్నారు. ‘‘గత సవరించిన అంచనాల్లో మా పన్ను వసూళ్ల లక్ష్యం 2019–20 సంవత్సరానికి రూ.13.78 లక్షల కోట్లుగా ఉంది. కానీ, ఇది వాస్తవానికి దూరంగా ఉంది. ఎందుకంటే అంతకుముందు ఏడాది వసూళ్లతో పోలిస్తే 24 శాతం ఎక్కువ. బడ్జెట్‌ సంప్రదింపుల సమయంలో మేం ఇదే తెలియజేశాం.

దీంతో పన్ను వసూళ్ల లక్ష్యాన్ని ఇప్పుడు రూ.13.35 లక్షల కోట్లుగా నిర్ణయించడం జరిగింది’’ అని మోడీ వివరించారు. దీంతో గతేడాది వసూళ్ల కంటే 17.5 శాతం ఎక్కువన్నారు. ఇది కష్టమైన లక్ష్యమే కానీ, అసాధ్యం మాత్రం కాదన్నారు. 2018–19 ఆర్థిక సంవత్సరంలో ఆదాయ పన్ను శాఖ ప్రత్యక్ష పన్నుల రూపంలో రూ.11.37 లక్షల కోట్లను వసూలు చేసిం ది. బడ్జెట్‌లో పెట్టుబడులు, వృద్ధికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహంతో, ఆర్థిక రంగం మంచి పనితీరు చూపుతుందని, దాంతో వసూళ్లు కూడా మెరుగ్గానే ఉంటాయని చెప్పారు. వస్తు సేవలç పన్ను (జీఎస్‌టీ) వసూళ్ల విషయంలో ఫలితాలు బాగుంటాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

రెండు రెట్లు తగ్గిన భారత కంపెనీల ఎఫ్‌డీఐలు
 ఆర్‌బీఐ జూన్‌ గణాంకాలు
ముంబై: భారత కంపెనీలు తమ విదేశీ వెంచర్లలో ఇన్వెస్ట్‌ చేసే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ) ఈ ఏడాది జూన్‌లో రెండు రెట్లకు పైగా తగ్గాయి. గత ఏడాది జూన్‌లో 229 కోట్ల డాలర్లుగా ఉన్న భారత కంపెనీల ఎఫ్‌డీఐలు ఈ ఏడాది జూన్‌లో 82 కోట్ల డాలర్లకు తగ్గాయని ఆర్‌బీఐ వెల్లడించింది. ఈ ఏడాది మేలో భారత కంపెనీల ఎఫ్‌డీఐలు 156 కోట్ల డాలర్ల మేర ఉన్నాయి.  భారత కంపెనీల జూన్‌ ఎఫ్‌డీఐల్లో ఈక్విటీ మార్గంలో 34 కోట్ల డాలర్లు, రుణాల రూపంలో 22 కోట్ల డాలర్లు, గ్యారంటీల రూపంలో 26 కోట్ల డాలర్లు ఉన్నాయి. ఓఎన్‌జీసీ విదేశ్‌... తన వివిధ విదేశీ వెంచర్లలో 6 కోట్ల డాలర్ల మేర ఇన్వెస్ట్‌ చేసింది. ఏషియన్‌ పెయింట్స్‌ 4.3 కోట్ల డాలర్లు, అలోక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ 2.4 కోట్ల డాలర్ల మేర ఇన్వెస్ట్‌ చేశాయి.   

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా