రూ.621 కోట్ల స్కాం : మాజీ చీఫ్‌పై కేసు నమోదు

14 Apr, 2018 19:01 IST|Sakshi

ముంబై : రూ.14 వేల కోట్ల భారీ కుంభకోణంతో కుదేలైన పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ) ఉదంతంతో పాటు ఇటీవల మరికొన్ని బ్యాంకుల కుంభకోణాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా యూకో బ్యాంకుకు చెందిన రూ.621 కోట్ల రుణ కుంభకోణం బట్టబయలైన సంగతి తెలిసిందే. ఈ కుంభకోణంలో భాగమైన బ్యాంకు మాజీ సీఎండీ అరుణ్‌ కౌల్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. అరుణ్‌ కౌల్‌తో పాటు ప్రైవేటీ కంపెనీపై కూడా సీబీఐ కేసు దాఖలు చేసింది. సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన వారిలో కౌల్‌తో పాటు, ఎరా ఇంజనీరింగ్‌ ఇన్‌ఫ్రా ఇండియా లిమిటెడ్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ హేమ్‌ సింగ్‌ భరాణా, చార్టెడ్‌ అకౌంటెంట్స్‌ పంకజ్‌ జైన్‌, వందనా శార్దాలు ఉన్నారు. 

ఆల్టియస్‌ ఫిన్‌సర్వ్‌ పవన్‌ బన్సాల్‌, ఇతర పబ్లిక్‌ సర్వెంట్లను కూడా ఈ కుంభకోణ కేసులో సీబీఐ విచారిస్తోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వీరు బ్యాంకులో రూ.621 కోట్ల రుణాలను తప్పుదోవ పట్టించినట్టు తెలిసింది. ఈ రుణాలను ఆమోదించిన అవసరాలకు ఉపయోగించలేదని, చార్టెడ్‌ అకౌంటెంట్లు అందించిన తప్పుడు సర్టిఫికేట్లతో ఈ రుణాలను పొందినట్టు అధికారులు చెప్పారు. కంపెనీ ఇలా అక్రమంగా రుణం పొందినప్పుడు కౌల్‌ బ్యాంకు సీఎండీగా ఉన్నారు. ఢిల్లీతో పాటు ఎనిమిది ప్రాంతాల్లో సీబీఐ తనికీలు నిర్వహించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి అధికారిక, నివాస ప్రాంతాల్లో ఈ తనిఖీలను చేపట్టింది. 
 

మరిన్ని వార్తలు