విమానయాన సంస్థలపై సీసీఐ జరిమానా 

8 Mar, 2018 04:32 IST|Sakshi

మూడింటిపై రూ.54 కోట్ల జరిమానా

న్యూఢిల్లీ: కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ) మూడు విమానయాన సంస్థలపై రూ.54 కోట్ల మేర జరిమానా విధించింది.  సరుకుల రవాణాపై సర్‌ చార్జీ విధించే విషయమై అనుచిత వ్యాపార విధానాలకు పాల్పడినందుకు  సీసీఐ ఈ జరిమానా విధించింది. జెట్‌ ఎయిర్‌వేస్‌పై రూ.39.81 కోట్లు, ఇంటర్‌ గ్లోబ్‌ ఏవియేషన్‌(ఇండిగో)పై రూ.9.45 కోట్లు, స్పైస్‌జెట్‌పై రూ.5.10 కోట్ల చొప్పున జరిమానాను సీసీఐ వడ్డించింది. ఇదే ఫిర్యాదుపై మూడేళ్ల కాలంలో సీసీఐ ఉత్తర్వులు జారీ చేయడం ఇది రెండోసారి. ఇలాంటి పోటీ వ్యతిరేక విధానాలను విడనాడాలని ఆయా విమాన సంస్థలను తాజాగా సీసీఐ ఆదేశించింది.  అయితే అప్పుడు విధించిన జరిమానా(రూ.257 కోట్లు) కంటే ఇప్పుడు వడ్డించిన జరిమానా  తక్కువ కావడం  విశేషం.

2015, నవంబర్‌లో సీసీఐ (అప్పట్లో కాంపిటీషన్‌ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌) జెట్‌ ఎయిర్‌వేస్‌పై రూ.152 కోట్లు, ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌పై రూ.64 కోట్లు, స్పైస్‌జెట్‌పై రూ.43 కోట్ల చొప్పున జరిమానా విధించింది. ఈ జరిమానాలపై ఆయా కంపెనీలు అప్పీల్‌ చేయడంతో ఆ ఉత్తర్వులను సీసీఐ పక్కనపెట్టింది. విచారణ అనంతరం తాజాగా సీసీఐ తక్కువ జరిమానాలను విధించింది. ఫ్యూయల్‌ సర్‌చార్జీ ముసుగులో రవాణా చార్జీలను అధికంగా విధించడం వినియోగదారులపై భారాన్ని మోపడమే కాకుండా ఆర్థిక అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని సీసీఐ వ్యాఖ్యానించింది. ఈ విషయంలో నిబంధనలను ఉల్లంఘించలేదంటూ ఎయిర్‌ ఇండియా, గో ఎయిర్‌లపై ఎలాంటి జరిమానాను సీసీఐ విధించలేదు.    

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా