నీరవ్‌కు రెడ్‌ కార్నర్‌ నోటీసులు?

14 Jun, 2018 13:14 IST|Sakshi
నీరవ్‌ మోదీ (ఫైల్‌ ఫోటో)

సాక్షి, ముంబై : సంచలనం సృష్టించిన పీఎన్‌బీ కుంభకోణంలో సీబీఐ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఈ కేసులో ప్రధాన నేరస్తుడు నీరవ్‌ మోదీని భారత్‌కు రప్పించే విషయంలో చట్టపరమైన చిక్కులు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. వీటిని పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తుంది. ఈ నేపధ్యంలో దీని గురించి చర్చించడానికి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు, సీబీఐ అధికారులు,  విదేశీ వ్యవహారా మంత్రిత్వ శాఖ అధికారులు గురువారం ఢిల్లీలో భేటీ అవ్వనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ భేటిలో నీరవ్‌ మోదీ, మెహుల్‌ చౌక్సీలను ఇండియాకు రప్పించే అంశం గురించే ప్రధానంగా చర్చించనున్నట్లు తెలిసింది. నీరవ్‌ మోదీ, మెహుల్‌ చౌక్సీలు ఏ దేశంలో ఉన్నారనే  సమాచారం తెలుసుకోవడం కోసం ‘రెడ్‌ కార్నర్‌ నోటీస్‌’(ఆర్‌సీఎన్‌) జారీ చేయాల్సిందిగా సీబీఐ ఇంటర్‌పోల్‌ను కోరిన నేపధ్యంలో ఈ భేటీ ప్రాముఖ్యతను సంతరించుకుంది.

ఈ విషయం గురించి ఒక ఉన్నతాధికారి ‘ఆర్‌సీఎన్‌ నోటీస్‌ను జారీ చేయాల్సిందిగా ఇంటర్‌ పోల్‌ను కోరాము. ఇది జులై నెల రెండోవారం లోపు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఒక్కసారి ఆర్‌సీఎన్‌ అంశం పూర్తైతే ఇక నేరస్తులు ఏ దేశంలో ఉన్న వారి గురించి సమాచారం తెలుసుకోవడం, వారిని తిరిగి భారత్‌ రప్పించడం సులువవుతుంది. అప్పుడు నీరవ్‌ మోదీ లాంటి వారిని అధికారికంగా ఇండియా రప్పించే ప్రక్రియ ప్రారంభమవుతుం’దన్నారు. ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం దేశం విడిచి పారిపోయిన నేరస్తులను తిరిగి ఇండియా రప్పించాలంటే పలు న్యాయ పరమైన చిక్కులు ఎదురవుతున్నాయి. గతంలో  లిక్కర్‌ కింగ్‌  విజయ్‌ మాల్యా విషయంలో కూడా ఇలాంటి ఇబ్బందులే ఎదురయ్యాయి. అందువల్లే సీబీఐ ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించి రెడ్‌ కార్నర్‌ నోటీస్‌ను జారీ చేయించనున్నట్లు సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు.

నీరవ్‌ మోదీ ఆచూకీపై భారత్‌కు బ్రిటన్‌ సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది. నీరవ్‌ మోదీ కేసును విచారిస్తున్న సీబీఐకి ఈమెయిల్‌ ద్వారా నీరవ్‌ మోదీ లండన్‌లోనే ఉన్నట్లు యూకే ప్రభుత్వం సమాధానం పంపినట్లు సంబంధిత వర్గాల సమాచారం. కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి ఏ దేశంలో ఉన్నాడో ఆచూకీ తెలియని పక్షంలో అంతర్జాతీయ సంస్థ ఇంటర్‌పోల్‌ ద్వారా  రెడ్‌ కార్నర్‌ నోటీసును జారీ చేసే అవకాశం దర్యాప్తు సంస్థలకు ఉంటుంది.

మరిన్ని వార్తలు