సన్, ర్యాన్‌బాక్సీ విలీనానికి షరతులతో ఓకే

9 Dec, 2014 00:39 IST|Sakshi
సన్, ర్యాన్‌బాక్సీ విలీనానికి షరతులతో ఓకే

న్యూఢిల్లీ: హెల్త్‌కేర్ దిగ్గజాలు సన్ ఫార్మా, ర్యాన్‌బాక్సీల మధ్య విలీనానికి ఎట్టకేలకు కాంపిటీషన్ కమిషన్(సీసీఐ) గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 4 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 24,000 కోట్లు) విలువైన ఈ విలీనానికి సీసీఐ కొన్ని షరతులు విధించింది. వీటి ప్రకారం కొన్ని రకాల ఉత్పత్తులను ఇతర సంస్థలకు విక్రయించడమేకాకుండా, పోటీ నివారణ వంటి అంశాలకు సంబంధించి ఒప్పందంలో మార్పులను సైతం చేపట్టవలసి ఉంటుంది. రెండు దిగ్గజాలు విలీనమైతే దేశీయంగా అతిపెద్ద ఫార్మా సంస్థ ఆవిర్భవించడంతోపాటు, ప్రపంచంలోనే ఐదో పెద్ద కంపెనీగా సన్-ర్యాన్‌బాక్సీ నిలుస్తుంది. వివాద పరిష్కారం ప్రకారం ‘టామ్‌సులోసిన్‌ప్లస్ టోల్టరోడిన్’ సంబంధిత మొత్తం ఉత్పత్తులను సన్ ఫార్మా ఇతర సంస్థలకు విక్రయించాల్సి ఉంటుంది.

వీటిని ప్రస్తుతం టామ్‌లెట్ బ్రాండ్‌తో కంపెనీ మార్కెట్లో విక్రయిస్తోంది. ఇదే విధంగా ర్యాన్‌బాక్సీ కూడా లియుప్రోలిన్ సంబంధ ఉత్పత్తులన్నింటినీ ఇతర సంస్థకు అమ్మేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం వీటిని ఎలిగార్డ్ బ్రాండ్‌తో మార్కెట్లో విక్రయిస్తోంది. దీంతోపాటు ర్యాన్‌బాక్సీ టెర్లిబాక్స్, రోసువాస్ ఈజెడ్, ఒలానెక్స్ ఎఫ్, రేసిపర్ ఎల్, ట్రిలోవాన్స్‌లను సైతం విక్రయించాలి. వెరసి సన్ ఫార్మా ఒకటి, ర్యాన్‌బాక్సీ ఆరు చొప్పున ఉత్పత్తులను వొదులుకోవలసి ఉంటుంది. ఇందుకు ఆరు నెలల గడువును సీసీఐ విధించింది. తద్వారా మార్కెట్లో ప్రస్తుతం కొనసాగుతున్న పోటీ వాతావరణాన్ని కొనసాగించవచ్చునని సీసీఐ అభిప్రాయపడింది.

మరిన్ని వార్తలు