రూ.3,000 కోట్లు సమీకరించనున్న డీఎల్‌ఎఫ్

11 Feb, 2015 02:09 IST|Sakshi
రూ.3,000 కోట్లు సమీకరించనున్న డీఎల్‌ఎఫ్

న్యూఢిల్లీ: రియల్టీ దిగ్గజం డీఎల్‌ఎఫ్ వచ్చే ఆర్థిక సంవత్సరంలో రెండు రీట్స్(రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్స్)ను ఏర్పాటు చేస్తోంది. అంతేకాకుండా వాటా విక్రయం, జాయింట్ వెంచర్ల ద్వారా రూ.3,000 కోట్లు సమీకరించనున్నది. రుణ భారం తగ్గించుకోవడానికి, నగదు నిల్వల పరిస్థితి మెరుగుపరచుకోవడానికి ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని డీఎల్‌ఎఫ్ పేర్కొంది. గత ఏడాది డిసెంబర్ 31 నాటికి కంపెనీ రుణభారం రూ.20,236 కోట్లుగా ఉంది.
 
సీసీఐ కొరడా: కాగా  డీఎల్‌ఎఫ్‌పై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) మంగళవారం మరోసారి కొరడా ఝులిపించింది. మార్కెట్లో అగ్రస్థానంలో ఉన్న ఈ కంపెనీ దానిని దుర్వినియోగం చేసేలా ప్రవర్తించిందని, దీనికి ప్రాథమికంగా ఆధారాలున్నాయని, ఈ విషయమై సమగ్రంగా దర్యాప్తు జరపాలని, 60 రోజుల్లో నివేదిక ఇవ్వాలని సీసీఐ ఆదేశాలిచ్చింది. డీఎల్‌ఎఫ్ యూనివర్శల్‌కు చెందిన గుర్గావ్‌లోని స్కైకోర్ట్ రెసిడెన్షియల్ ప్రాజెక్టుకు సంబంధించి సీసీఐ ఈ ఆదేశాలిచ్చింది.

డీఎల్‌ఎఫ్‌పై సీసీఐ ఇలాంటి ఆదేశాలివ్వడం  రెండు రోజుల్లో ఇది రెండోసారి. గుర్గావ్‌లోనే ఉన్న డీఎల్‌ఎఫ్ గార్డెన్ సిటీ ప్రాజెక్ట్‌కు సంబంధించి సీసీఐ సోమవారం కూడా ఇదే తరహా దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేసింది. కొన్ని కేసుల్లో డీఎల్‌ఎఫ్‌దే తప్పంటూ ఇప్పటికే సీసీఐ డీఎల్‌ఎఫ్‌పై సీసీఐ రూ.630 కోట్ల జరిమానా విధించింది. దీనికి సంబంధించిన కేసు సుప్రీం కోర్టు విచారణలో ఉంది.

మరిన్ని వార్తలు