సీడీఎస్‌ఎల్‌ లిస్టింగ్‌ ధమాకా!

1 Jul, 2017 00:56 IST|Sakshi
సీడీఎస్‌ఎల్‌ లిస్టింగ్‌ ధమాకా!

ఇష్యూ ధర 149.. రూ.250 వద్ద లిస్టింగ్‌
75% అప్‌... రూ.262 వద్ద క్లోజ్‌

న్యూఢిల్లీ: బీఎస్‌ఈకి చెందిన సెంట్రల్‌ డిపాజిటరీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (సీడీఎస్‌ఎల్‌) స్టాక్‌ మార్కెట్‌లో అదిరిపోయే అరంగేట్రం చేసింది. శుక్రవారం నేషనల్‌ స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌లో (ఎన్‌ఎస్‌ఈ) లిస్టింగ్‌ రోజు మెరుపులు మెరిపించింది. ఇష్యూ ధర రూ.149తో పోలిస్తే ఏకంగా 68 శాతం ప్రీమియంతో రూ.250 వద్ద ఈ షేర్లు లిస్టయ్యాయి. చివరివరకూ ఈ జోరును కొనసాగించడమే కాకుండా 75.5 శాతం లాభంతో రూ.261.60 వద్ద స్థిరపడింది. 5 కోట్ల మేర షేరు చేతులుమారాయి.

గత నెలలో ఐపీఓకి వచ్చిన సీడీఎస్‌ఎల్‌ ఇష్యూకి రికార్డు స్థాయిలో 170 రెట్ల ఓవర్‌ సబ్‌స్క్రిప్షన్‌ లభించిన సంగతి తెలిసిందే. ‘మా సంస్థ లిస్టింగ్‌ ద్వారా ఇన్వెస్టర్లకు లాభాలు పంచడం ఆనందంగా ఉంది. ఇది స్టాక్‌ మార్కెట్‌లో సానుకూల సెంటిమెంట్‌కు దోహదం చేస్తుంది’ అని సీడీఎస్‌ఎల్‌ ఎండీ, సీఈఓ పి.ఎన్‌.రెడ్డి పేర్కొన్నారు. సీడీఎస్‌ఎల్‌ లిస్టింగ్‌.. దేశీ క్యాపిటల్‌ మార్కెట్స్‌ చరిత్రలో కీలకమైన మైలురాయి అని ఎన్‌ఎస్‌ఈ తాత్కాలిక సీఈఓ జె.రవిచంద్రన్‌ అభివర్ణించారు.

మరిన్ని వార్తలు