ప్రచారానికి సెలబ్రిటీలు!

7 Apr, 2018 01:27 IST|Sakshi

సెలబ్రిటీ హబ్‌లో 40 వేల మంది నమోదు

ఓపెనింగ్, బ్రాండింగ్, ప్రమోషన్‌ సేవలు

గతేడాది రూ.15 కోట్ల ఆదాయం

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో :  సెలబ్రిటీలతో ప్రచారం అంటే కార్పొరేట్‌ సంస్థలకో లేక పెద్ద కంపెనీలకో పరిమితమైన విషయం. కానీ, దీన్నిప్పుడు చాలా సులభతరం చేసేసింది సెలబ్రిటీ హబ్‌! జస్ట్‌ మన బడ్జెట్‌ను ఎంటర్‌ చేస్తే చాలు అందుబాటులో ఉండే సెలబ్రిటీలు, ప్రముఖులను తెచ్చేస్తుంది. మరిన్ని వివరాలు సెలబ్రిటీ హబ్‌ చైర్మన్‌ జే చైతన్య ‘స్టార్టప్‌ డైరీ’తో పంచుకున్నారు.

ఈ రోజుల్లో బ్రాండింగ్, ప్రచారం లేకపోతే వస్తువులు, ఉత్పత్తులను ప్రజలు ఆదరించట్లేదు. మరి, సెలబ్రిటీలు, ప్రముఖులతో ప్రచారం చేయించాలంటే వాళ్లు ఎక్కడుంటారో తెలియదు? ఎలా కలవాలో తెలియదు? ఒకవేళ కలిసినా మనకు టైమిస్తారో లేదో తెలియదు? ఇలా రకరకాల సమస్యలుంటాయి. వీటన్నింటికీ పరిష్కరించడమే సెలబ్రిటీ హబ్‌ ప్రత్యేకత. ప్రారంభోత్సవాలకు, బ్రాండింగ్‌ ప్రమోషన్‌ చేయించడం మా పని.

40 వేల మంది సెలబ్రిటీల నమోదు..
2014లో విజయవాడ కేంద్రంగా సెలబ్రిటీ హబ్‌ను ప్రారంభించాం. ప్రస్తుతం 40 వేల మంది సెలబ్రిటీలతో ఒప్పందం చేసుకున్నాం. ఇందులో మోడల్స్‌లతో పాటూ టీవీ, సినీ, క్రీడా రంగానికి చెందిన ప్రముఖులు, సెలబ్రిటీలున్నారు. ఉత్తరాది టీవీ, చిత్ర పరిశ్రమలోని ఆర్టిస్టులు, సెలబ్రిటీల కోసం ముంబైకి చెందిన సిమ్‌కామ్‌ మోడల్‌ మేనేజ్‌మెంట్, జాకీ ఫెర్నాండెజ్, పినాకిల్‌ వంటి సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం.

ప్రారంభ ధర రూ.50 వేలు..
ప్రస్తుతం నెలకు 25 కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. విజయవాడ, హైదరాబాద్, విశాఖపట్నం, ముంబై, చెన్నై, బెంగళూరు, గోవా, మలేషియా, శ్రీలంక, దుబాయ్, అమెరికా దేశాల్లో సేవలందించాం. త్వరలోనే మలేషియా తెలుగు అసోసియేషన్‌ కార్యక్రమాన్ని, ఏలూరు ఓ రియల్టీ సంస్థతో బ్రాండింగ్‌ కార్యక్రమానికి ఒప్పందం కుదిరింది.

టీవీ ఆర్టిస్ట్‌ల ప్రారంభ ధర రూ.50 వేల నుంచి ఉన్నాయి. సినీ సెలబ్రిటీలైతే రూ.లక్ష నుంచి రూ.2 కోట్ల వరకుంది. క్రీడా ప్రముఖులైతే రూ.15 లక్షల నుంచి మొదలవుతుంది. వసతులు, ప్రయాణ ఖర్చులు, భద్రత, ఇతరత్రా అవసరాలన్నీ కూడా సెలబ్రిటీ హబ్బే కల్పిస్తుంది.  

రూ.30 కోట్ల వ్యాపార లక్ష్యం
ప్రస్తుతం మా కంపెనీలో 16 మంది శాశ్వత ఉద్యోగులున్నారు. గతేడాది రూ.15 కోట్ల వ్యాపారాన్ని చేరుకున్నాం. ఈ ఏడాది రూ.30 కోట్లు లకి‡్ష్యంచాం. 

మరిన్ని వార్తలు