సిమెంట్, ఇటుకలూ గ్రీనే

7 Apr, 2018 01:50 IST|Sakshi

దేశంలో రూ.18 లక్షల కోట్లకు నిర్మాణ సామగ్రి ఉత్పత్తులు

భవనాలకే కాదు.. నిర్మాణ సామగ్రికి కూడా ఐజీబీసీ గుర్తింపు

తెలంగాణలో 106; ఏపీలో 25 ప్రాజెక్ట్‌లకు గుర్తింపు 

వేసవి కాలం వచ్చిందంటే చాలు విద్యుత్, నీటి వాడకం పెరుగుతుంది. కొన్ని ఇళ్లల్లో అయితే కరెంట్‌ కట్‌లు, నీటి కటకటలూ అనుభవమే. కానీ, హరిత భవనాల్లో వేసవిలోనూ చల్లగా ఎంజాయ్‌ చేయొచ్చు. పైగా 30–40 శాతం విద్యుత్‌ వినియోగం, 20–30 శాతం నీటి వినియోగమూ తగ్గుతుంది.  

సాక్షి, హైదరాబాద్‌ :  విద్యుత్, నీటి బిల్లుల ఆదా, నిర్వహణ వ్యయం తగ్గింపు, ఆరోగ్యకరమైన వాతావరణం వంటి కారణాలతో హరిత భవనాలకు డిమాండ్‌ పెరిగింది. గతంలో పర్యావరణహితమైన ఇల్లు కొనాలంటే కాలుష్యం, జనాభా తక్కువగా ఉండే ప్రాంతాలకో లేక శివారు ప్రాంతాలకో వెళ్లాల్సిన పరిస్థితి.

కానీ, నేడు నగరంలో, హాట్‌సిటీలో ఉంటూ కూడా హరిత భవనాలు కావాలంటున్నారు కొనుగోలుదారులు. దీంతో నిర్మాణ సంస్థలు ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ (ఐజీబీసీ) ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించిన గృహాలనే కాదు.. ఐజీబీసీ గుర్తింపు పొందిన నిర్మాణ సామగ్రిని, ఉత్పత్తులను వినియోగిస్తున్నాయి.  

350 రకాల ఉత్పత్తులు..
నివాసాలకు, వాణిజ్య, కార్యాలయాల సముదాయాలకూ హరిత భవనాల గుర్తింపునివ్వటం మనకు తెలిసిందే. కానీ, దేశంలో తొలిసారిగా నిర్మాణ సామగ్రి ఉత్పత్తులకూ గుర్తింపు ప్రారంభించింది సీఐఐ. దీంతో కొనుగోలుదారులకు గృహాల్లోనే కాకుండా నిర్మాణ సామగ్రిలోనూ గ్రీన్‌ ప్రొ సర్టిఫికెట్‌ పొందిన ఉత్పత్తులను ఎంపిక చేసుకునే వీలుందన్నమాట.

ఇప్పటివరకు 350 ఉత్పత్తులు గ్రీన్‌ సర్టిఫికెట్‌ పొందాయి. ఏసీసీ సిమెంట్, నిప్పన్‌ పెయింట్స్, సెయింట్‌ గోబియన్‌ గ్లాస్, అసాహి ఇండియన్‌ గ్లాస్, గోద్రెజ్‌ ఫర్నిచర్, విశాక ఇండస్ట్రీస్‌ వంటివి ఉన్నాయి. దేశంలో గ్రీన్‌ బిల్డింగ్స్‌ ఉత్పత్తుల మార్కె ట్‌ రూ.18 లక్షల కోట్లుగా ఉందని సీఐఐ –గ్రీన్‌ ప్రొడక్ట్స్‌ అండ్‌ సర్వీసెస్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ పరుశురామన్‌ ఆర్‌ తెలిపారు.

నిర్మాణ వ్యయం ఎక్కువే, కానీ..
సాధారణ భవనాలతో పోలిస్తే హరిత భవనాల నిర్మాణానికి 3–5 శాతం ధర ఎక్కువ అవుతుంది. కానీ, భవనంలోని విద్యుత్, నీటి వంటి నిర్వహణ వ్యయం ఆదాతో దీని 2–3 ఏళ్లలో తిరిగి పొందవచ్చని ఐజీబీసీ హైదరాబాద్‌ చాప్టర్‌ సీ శేఖర్‌ రెడ్డి చెప్పారు.

గ్రీన్‌ బిల్డింగ్స్‌లో 30–40 శాతం విద్యుత్, 20–30 శాతం నీరు అదా అవుతుందన్నారు. హరిత భవనాలు, ఉత్పత్తులపై డెవలపర్లు, కొనుగోలుదారులకు అవగాహన కల్పించేందుకు ఈనెల 17, 18 తేదీల్లో గ్రీన్‌ ప్రొ సమ్మిట్‌ను నిర్వహించనున్నట్లు చెప్పారు. 

తెలంగాణలో 106; ఏపీలో 25 ప్రాజెక్ట్‌లు..
ప్రస్తుతం దేశంలో 4,396 ప్రాజెక్ట్‌లు ఐజీబీసీ గుర్తింపు కోసం నమోదు కాగా.. ఇందులో 1,258 ప్రాజెక్ట్‌లు గుర్తింపు పొందాయి. ఇవి 1,044.66 మిలియన్‌ చ.అ.ల్లో విస్తరించి ఉన్నాయి. తెలంగాణలో 296 ప్రాజెక్ట్‌లు నమోదు కాగా 106 ప్రాజెక్ట్‌లు గుర్తింపు పొందాయి.

ఇవి 30 మిలియన్‌ చ.అ.ల్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 57 ప్రాజెక్ట్‌లు నమోదు కాగా.. 25 ప్రాజెక్ట్‌లు గుర్తింపు పొందాయి. ఇవి 4 మిలియన్‌ చ.అ.ల్లో ఉన్నాయి. వరంగల్‌లో మణికంఠ గ్రీన్‌ హోమ్‌ ప్రాజెక్ట్‌ ఐజీబీసీ గుర్తింపు పొందింది. కరీంనగర్‌లో డీమార్ట్, వరంగల్‌లో గంగదేవిపల్లి గ్రామం కూడా ఐజీబీసీ గుర్తింపు పొందింది.

మరిన్ని వార్తలు