దక్షిణాదిన 7% పెరగనున్న సిమెంటు డిమాండ్

21 Jun, 2014 01:03 IST|Sakshi
దక్షిణాదిన 7% పెరగనున్న సిమెంటు డిమాండ్

కార్వీ నివేదిక
 
ముంబై: దక్షిణాదిన సిమెంటుకు డిమాండు ఈ ఏడాది 5-7 శాతం పెరగవచ్చని కార్వీ బ్రోకింగ్ కంపెనీ నివేదిక తెలిపింది. 2012-13తో పోలిస్తే 2013-14లో డిమాండు ఒక శాతం వృద్ధి చెందింది. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం సిమెంటు ప్లాంట్ల సామర్థ్య వినియోగం పుంజుకుంటుందని నివేదికలో తెలిపారు.
 
దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మార్కెట్లో వార్షిక డిమాండ్ 21 మిలియన్ టన్నులుండగా ఈ ఏడాది 10-12 శాతం పెరిగే అవకాశం ఉంది. గతేడాది వృద్ధి రేటు 6 శాతమే. తమిళనాడులో డిమాండు 20 మిలియన్ టన్నులు కాగా ఈ సంవత్సరం 4-5 శాతం పెరగవచ్చు. కర్ణాటకలో డిమాండు 16 మిలియన్ టన్నులు కాగా 3-5 శాతం వృద్ధిచెందవచ్చు. కేరళలో డిమాండు 10 మిలియన్ టన్నులు కాగా 8-10 శాతం పుంజుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ స్థిరత్వం ఏర్పడిన నేపథ్యంలో మౌలిక సౌకర్యాల ప్రాజెక్టుల నుంచి సిమెంటుకు అధిక డిమాండు రావచ్చని కార్వీ బ్రోకింగ్ విశ్లేషకుడు రాజేశ్ కుమార్ చెప్పారు.
 
పెండింగ్ ప్రాజెక్టులతో పాటు కొత్త ప్రాజెక్టులకూ సిమెంటు అవసరం కావడంతో డిమాండు రెండంకెల స్థాయిలో పెరిగే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్ర విభజన జరిగిపోయిన నేపథ్యంలో విశాఖ, విజయవాడ, తిరుపతిలు కీలక నగరాలుగా ఆవిర్భవిస్తాయని పేర్కొన్నారు. విశాఖ మెయిన్ హబ్‌గా మారుతుందనీ, విజయవాడ, తిరుపతిలు కమర్షియల్, ఐటీ హబ్‌లుగా రూపొందుతాయనీ భావిస్తున్నట్లు వివరించారు. సిమెంటుకు డిమాండు ప్రధానంగా పోలవరం వంటి భారీ ప్రాజెక్టుల కారణంగా పెరుగుతుందని అన్నారు.

మరిన్ని వార్తలు