ప్రస్తుతం నష్టాల్లో పరిశ్రమ

26 Mar, 2014 02:26 IST|Sakshi
ప్రస్తుతం నష్టాల్లో పరిశ్రమ

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రాష్ట్రంలో సిమెంటు రంగం ఆరు నెలల్లో గాడిన పడుతుందని పరిశ్రమ భావిస్తోంది. కొత్త రాష్ట్రాల్లో సాధారణంగా మౌలిక వసతుల పరంగా అభివృద్ధి ఉంటుంది కాబట్టి సిమెంటుకు డిమాండ్ పెరుగుతుందని పరిశ్రమ వర్గాలు విశ్వసిస్తున్నాయి. ఇదే జరిగితే పరిశ్రమకు పెద్ద ఊరట లభిస్తుందని ప్రముఖ కంపెనీకి చెందిన అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.

నాలుగేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో నిర్మాణ రంగం ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందలేదు. ప్రభుత్వ సంబంధిత నిర్మాణ పనులవల్ల సాధారణంగా ఎన్నికల ముందు సిమెంటకు డిమాండ్ పెరుగుతుంది. అయితే ఈ దఫా ఆ తరహా పనులేవీ జరగడం లేదు. దాంతో పరిశ్రమ ఇంకా నీరసంగానే నెట్టుకొస్తోంది.  సిమెంటు కంపెనీలు పెద్ద ఎత్తున నష్టాలను మూటగట్టుకుంటున్నాయి. సిమెంటు వినియోగం పెరిగితేనే కంపెనీలు మనగలుగుతాయి. ఈ ఏడాది అక్టోబరు నుంచి నెలకు 20 లక్షల టన్నుల సిమెంటు అమ్ముడవుతుందని పరిశ్రమ అంచనా వేస్తోంది.

 బస్తాకు రూ.60 దాకా నష్టం..: రాష్ట్రంలో నాలుగేళ్ల క్రితం నెలకు 23-24 లక్షల టన్నుల సిమెంటు అమ్ముడైంది. ఇప్పుడది నెలకు 15-16 లక్షల టన్నులకు పడిపోయింది. రాజకీయ అనిశ్చితి, బలహీన సెంటిమెంటుతో అమ్మకాలు గణనీయంగా క్షీణించాయి. రాష్ట్రంలో బస్తా సిమెంటు ధర అటూఇటూగా రూ.220-250 పలుకుతోంది. ఉత్తరాదిన ఇది రూ.350 ఉంది. కంపెనీల మధ్య పోటీ కారణంగానే రాష్ట్రంలో ధర తక్కువగా ఉందని ఒక కంపెనీ ప్రతినిధి వెల్లడించారు. ఒక్కో బస్తాపైన రకాన్నిబట్టి కంపెనీలు రూ.20-60 దాకా నష్టపోతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో మూడు కంపెనీలు మూతపడ్డాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరిన్ని ప్లాంట్లు మూతపడక తప్పదని అన్నారు. అక్టోబరు నుంచి అమ్మకాలు పుంజుకుంటాయన్న సంకేతాలు ఉన్నాయి. బస్తా ధర రూ.300-320 ఉండాలని కంపెనీలు భావిస్తున్నాయి. అలా అయితేనే నష్టాల నుంచి గట్టెక్కుతామన్న ధీమాను వ్యక్తం చేస్తున్నాయి.


 ఖర్చులనుబట్టే ధర..: గిరాకీ-సరఫరాకుతోడు సెంటిమెంటు బాగోలేనప్పుడు సహజంగానే సిమెంటు ధరలు తక్కువగా ఉంటాయి. రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితి ఇలాంటిదే. రానున్న రోజుల్లో డిమాండ్ పెరిగినంత మాత్రాన ధరలు గణనీయంగా పెరుగుతాయని చెప్పలేమని ఒక కంపెనీ ప్రతినిధి వెల్లడించారు. కేంద్రంలో, రాష్ట్రంలో స్థిర ప్రభుత్వం వస్తేనే అభివృద్ధి ఉంటుంది. దీనికనుగుణంగానే సిమెంటు పరిశ్రమ వృద్ధి ఆధారపడుతుందన్నారు.

 బొగ్గు, డీజి ల్, విద్యుత్ చార్జీలపై కొత్త సర్కారు పన్నుల విధానం పరిశ్రమకు కీలకమని వెల్లడించారు. వీటి ధరలకుతోడు తయారీ వ్యయం ఆధారంగానే సిమెంటు ధర నిర్ణయమవుతుందని ఆయన చెప్పారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌లోని సిమెంటు కంపెనీలన్నింటి వార్షిక స్థాపిత సామర్థ్యం సుమారు 70 మిలియన్(7 కోట్లు) టన్నులు. ఉత్పత్తి 45-50 మిలియన్ టన్నులకు పరిమితమైంది. ఇందులో రాష్ట్ర అవసరాలకుపోను మిగిలినది తమిళనాడు, కర్నాటక, ఒరిస్సాలకు తరలివెళ్తోంది.
 
 ప్రోత్సాహమిస్తే మరిన్ని..
 రాష్ట్ర కంపెనీలు ఇటీవలి కాలం నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్‌కు నెలకు సుమారు లక్ష టన్నుల సిమెంటు, క్లింకర్‌ను ఎగుమతి చేస్తున్నాయి. పోర్టు చార్జీల తగ్గింపు, పన్నుల మినహాయింపు వంటి ప్రోత్సాహకాలిస్తే ఎగుమతులు మరింత పెంచేందుకు పరిశ్రమ సిద్ధంగా ఉంది. కొత్త ప్రభుత్వం గనక చార్జీలు పెంచితే తయారీ వ్యయంతోపాటు సిమెంటు ధరలకూ రెక్కలొస్తాయి. తద్వారా ఎగుమతులు తగ్గుతాయనేది పరిశ్రమ ఆందోళన.

మరిన్ని వార్తలు