సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నష్టాలు 924 కోట్లు 

15 Nov, 2018 00:52 IST|Sakshi

సీక్వెన్షియల్‌గా తగ్గిన నష్టం

 మొత్తం ఆదాయం కూడా తగ్గింది   

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్లో రూ.924 కోట్ల నికర నష్టాలొచ్చాయి. గత ఏడాది క్యూ2లో ఈ నికర నష్టాలు రూ.750 కోట్లుగా ఉన్నట్లు బ్యాంకు తెలియజేసింది. ఆదాయం తగ్గడం, మొండి బకాయిలు మరింతగా పెరగడంతో ఈ క్యూ2లో నికర నష్టాలు పెరిగాయని వెల్లడించింది. అయితే ఈ క్యూ1లో వచ్చిన నష్టాలు రూ.1,522 కోట్లతో పోలిస్తే ఈ సారి తగ్గినట్లే లెక్క. 

మరింత క్షీణించిన రుణ నాణ్యత 
గత క్యూ2లో రూ.6,166 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ2లో రూ.5,685 కోట్లకు తగ్గిందని సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తెలిపింది. వడ్డీ ఆదాయం రూ.6,166 కోట్ల నుంచి రూ.5,685 కోట్లకు తగ్గింది. బ్యాంక్‌ రుణ నాణ్యత మరింతగా క్షీణించింది. గత క్యూ2లో రూ.31,641 కోట్లుగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ2లో రూ.37,411 కోట్లకు పెరిగాయి. అయితే నికర మొండి బకాయిలు మాత్రం రూ.15,900 కోట్ల నుంచి రూ.15,794 కోట్లకు తగ్గాయి. శాతం పరంగా చూస్తే, స్థూల మొండి బకాయిలు 17.27 శాతం నుంచి 21.48 శాతానికి, నికర మొండి బకాయిలు 9.53 శాతం నుంచి 10.36 శాతానికి పెరిగాయి. సీక్వెన్షియల్‌గా చూస్తే, మొండి బకాయిలు ఒకింత మెరుగయ్యాయని బ్యాంకు పేర్కొంది. మొండి బకాయలు పెరిగినా, వాటికి కేటాయింపులను తగ్గించామని తెలిపింది. మొండి బకాయిలకు కేటాయింపులు గత క్యూ2లో రూ.1,792 కోట్లుగా ఉండగా, ఈ క్యూ2లో రూ.1,649 కోట్లకు తగ్గాయి. అయితే మొత్తం కేటాయింపులు మాత్రం రూ.1,962 కోట్ల నుంచి రూ.1,983 కోట్లకు పెరిగాయి. ప్రొవిజన్‌ కవరేజ్‌ రేషియో (పీసీఆర్‌) 58.58 శాతం నుంచి 67.74 శాతానికి పెరిగిందని తెలిపింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా షేర్‌ 1.2 శాతం నష్టంతో రూ.30.85 వద్ద ముగిసింది.   

మరిన్ని వార్తలు