డిపాజిట్‌తో క్రెడిట్‌కార్డు ఉచితం

18 Nov, 2014 00:46 IST|Sakshi
డిపాజిట్‌తో క్రెడిట్‌కార్డు ఉచితం

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వరంగ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిపాజిట్‌తో పాటు ఉచిత క్రెడిట్ కార్డును అందించే కొత్త డిపాజిట్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ‘సెంట్ అస్పైర్ డిపాజిట్ స్కీం’ పేరుతో ప్రవేశపెట్టిన ఈ పథకంలో డిపాజిట్ చేసిన మొత్తంలో 80 శాతం పరిమితితో కూడిన క్రెడిట్ కార్డును అందిస్తున్నట్లు సెంట్రల్ బ్యాంక్ ఆంధ్రా, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ఫీల్డ్ జనరల్ మేనేజర్ కె.ఈశ్వర్ తెలిపారు.

ఈ కొత్త పథకాల వివరాలను తెలియచేయడానికి సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆదాయ ధ్రువీకరణ, సిబిల్ నివేదికలు అవసరం లేకుండానే క్రెడిట్ కార్డును అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్డుపై 55 రోజుల ఉచిత క్రెడిట్, ఆపైన నెలకు 1.5 శాతం వడ్డీని వసూలు చేయనున్నట్లు తెలిపారు. కనీస డిపాజిట్ మొత్తాన్ని రూ. 20,000గా నిర్ణయించారు.

 ఇదే సమయంలో ‘సెంట్ హోమ్ డబుల్ ప్లస్’ పేరుతో మరో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద 10.25% వడ్డీకే గృహ రుణం అందించడంతో పాటు, మంజూరై వాడుకోని గృహ రుణ మొత్తాన్ని ఓవర్ డ్రాఫ్ట్‌గా వినియోగించుకోవచ్చన్నారు. ఇది కాకుండా ఇతర అవసరాల కోసం గృహ రుణం మొత్తంపై 10% వరకు రుణం తీసుకునే వెసులుబాటును కల్పిస్తోంది. ఇలా అదనంగా ఇచ్చిన రుణంపై తీసుకున్న అవసరాన్ని బట్టి వడ్డీరేటు మారుతుందని ఈశ్వర్ తెలిపారు.

మరిన్ని వార్తలు