ఇంకా తగ్గించాలని ఓఎంసీలకు చెప్పం..!

12 Oct, 2018 01:05 IST|Sakshi

పెట్రోల్‌ రేట్లపై  కేంద్ర ఆర్థిక శాఖ వర్గాల వెల్లడి 

న్యూఢిల్లీ: పెట్రోల్‌ రేట్లు తగ్గించాలంటూ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలను ఆదేశించడం ద్వారా ప్రభుత్వం ఇంధన రేట్ల సంస్కరణలను పక్కన పెట్టి మళ్లీ పాత విధానాలకే మళ్లుతోందంటూ వస్తున్న ఆరోపణలను కేంద్రం తోసిపుచ్చింది. ఇది ఈ ఒక్క సారికి మాత్రమే పరిమితమని, మరోసారి జరగబోదని స్పష్టం చేసింది. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్‌ కంపెనీలకు ఇకపైనా మార్కెటింగ్‌ స్వేచ్ఛ ఉంటుందని, ఇక ఓఎన్‌జీసీ వంటి చమురు ఉత్పత్తి సంస్థలను కూడా ఇంధన సబ్సిడీ భారాన్ని భరించాలని కేంద్రం అడగబోదని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొన్నాయి. దేశీయంగా ఇంధన ధరలు ఎగియడంతో కేంద్రం ఇటీవల పెట్రోల్, డీజిల్‌ రేట్లను రూ. 2.50 మేర తగ్గించిన సంగతి తెలిసిందే. అయితే, ఇందులో రూ. 1.50 ఎక్సయిజ్‌ సుంకాల తగ్గింపు రూపంలో ఉండగా, మిగతా రూ.1 భారాన్ని భరించాలంటూ చమురు కంపెనీలను కేంద్రం ఆదేశించింది.

ఇంధన రేట్లపై నియంత్రణ ఎత్తివేసిన తర్వాత తొలిసారిగా కేంద్రం ఈ విధమైన ఆదేశాలివ్వడంతో చమురు కంపెనీలకు (ఓఎంసీ) మళ్లీ సబ్సిడీల భారం తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.   అక్టోబర్‌ 5న రేట్లను తగ్గించినప్పటికీ.. ఆ తర్వాత ఇంధన రేటు మళ్లీ పెరుగుతూ పోవడంతో కేంద్రం మరోసారి ఓఎంసీలను ధర తగ్గించమని సూచించవచ్చనే వార్తలొచ్చాయి. తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు వీటిపై వివరణనిచ్చాయి. దీంతో గురువారం ఆయిల్‌ కంపెనీల షేర్లు గణనీయంగా పెరిగాయి. ఇంట్రాడేలో హెచ్‌పీసీఎల్‌ 19 శాతం, బీపీసీఎల్‌ 7 శాతం, ఐవోసీ 8 శాతం ఎగిశాయి. బీఎస్‌ఈలో చివరికి హెచ్‌పీసీఎల్‌ షేరు సుమారు 15 శాతం పెరిగి రూ. 207.15 వద్ద, బీపీసీఎల్‌ 5 శాతం పెరుగుదలతో రూ. 278.65, ఐవోసీ 5 శాతం పెరిగి రూ. 131 వద్ద క్లోజయ్యాయి. పెట్రోల్‌ రేట్ల తగ్గింపు ప్రకటించినప్పట్నుంచీ ప్రభుత్వ రంగంలోని ఆయిల్‌ కంపెనీల షేర్ల ధరలు దాదాపు 20 శాతం దాకా క్షీణించాయి.    

మరిన్ని వార్తలు