ఏపీలో వైద్య రంగం అభివృద్ధికి కేంద్రం సాయం

17 Aug, 2014 00:44 IST|Sakshi
ఏపీలో వైద్య రంగం అభివృద్ధికి కేంద్రం సాయం

కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు
విజయవాడలో కామినేనిఆసుపత్రి ప్రారంభం


విజయవాడ:  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య రంగం అభివృద్ధికి తోడ్పాటును అందిస్తామని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖా మంత్రి  ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు.  విజయవాడ సమీపంలో రూ. 150 కోట్లతో నిర్మించిన కామినేని ఆసుపత్రిని శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన జరిగిన తరువాత ఏపీలో వైద్య రంగాన్ని అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడిందన్నారు. ఇప్పటివరకు హైదరాబాద్‌లో ఉన్న ఆధునిక వైద్యం ఇక మీదట ఏపీ ప్రజలకు కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్రం సాయమందించటానికి సిద్ధంగా ఉందని తెలిపారు.
 
ఇందులో భాగంగా రూ.1200 కోట్లతో మంగళగిరి వద్ద ఎయిమ్స్ ఆసుపత్రి ఏర్పాటు చేయనున్నామన్నారు. ప్రస్తుత తరుణంలో ఏపీలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు కలిసి పనిచేయాల్సి ఉందన్నారు. అందరికీ వైద్యం అందించడానికి కేంద్రంలో మోడీ ప్రభుత్వం యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ప్రవేశ పెట్టిందని, దీనిని మూడు నెలల్లో అమలులోకి తీసుకువస్తామన్నారు. విజయవాడలో కామినేని ఆసుపత్రి ఏర్పాటుతో అత్యాధునిక వైద్యం ప్రజలకు అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మాట్లాడుతూ.. ప్రైవేటు ఆసుపత్రులు వ్యాపారం కోసమే కాకుండా సేవా భావంతో కూడా సవలందించాలని కోరారు.
 
రాష్ట్ర ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ, ఎయిమ్స్ ఏర్పాటుకు రూ.1200 కోట్లు, విజయవాడ, అనంతపురంలో సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటుకు రూ.150 కోట్ల చొప్పున, అలాగే.. విజయవాడ-గుంటూరు మధ్యలో కేన్సర్ ఆసుపత్రికి రూ.120 కోట్లు, నెల్లూరు, కర్నూలులో కేన్సర్ ఆస్పత్రులకు రూ.45 కోట్ల చొప్పున నిధులు మంజూరుకు కేంద్ర అంగీకరించిందని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, మంత్రులు పరిటాల సునీత, పి. నారాయణ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు