బ్యాంకుల్లో కేంద్రం వాటా తగ్గించుకోవాలి

19 Feb, 2018 00:08 IST|Sakshi

వాటిని స్వతంత్రంగా పనిచేసేలా చూడాలి

అసోచామ్‌ సూచన

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకు (పీఎస్‌బీ)ల్లో కేంద్రం తనకున్న వాటాను 50 శాతం లోపునకు తగ్గించుకోవాలని అసోచామ్‌ సూచించింది. పీఎన్‌బీలో బయటపడిన రూ.11,400 కోట్ల కుంభకోణం వాటా తగ్గింపునకు బలమైన సంకేతంగా పేర్కొంది. వాటాదారులకు జవాబుదారీగా, డిపాజిటర్ల ప్రయోజనాల పరిరక్షణ కోణంలో, ప్రైవేటు బ్యాంకుల మాదిరిగా పనిచేసేలా ప్రభుత్వరంగ బ్యాంకులను అనుమతించాలని అసోచామ్‌ సూచించింది.

‘‘చారిత్రకంగా చూస్తే ప్రభుత్వరంగ బ్యాంకులు ఒక సంక్షోభం తర్వాత ఒక సంక్షోభం ఎదుర్కొంటున్నాయి. వీటిలో ప్రభుత్వం ప్రధాన వాటాదారుగా ఉన్నప్పటికీ పన్ను చెల్లింపులదారుల డబ్బుతో వీటిని ఒడ్డున పడేసే విషయంలో ఒక పరిమితి అంటూ ఉంది’’అని అసోచామ్‌ తన ప్రకటనలో పేర్కొంది. బ్యాంకుల్లో ఉన్నత పదవులను ప్రభుత్వ ఉద్యోగాలకు కొనసాగింపుగా భావించే పరిస్థితి కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. ప్రభుత్వం తన వాటాను 50 శాతం లోపునకు తగ్గించుకుంటే, వాటికి మరింత స్వతంత్రతతోపాటు సీనియర్‌ మేనేజ్‌మెంట్‌లో బాధ్యత, జవాబుదారీతనం పెరుగుతాయని అసోచామ్‌ సూచించింది.

మరిన్ని వార్తలు