పప్పుధాన్యాలపై పన్నులొద్దు...

22 May, 2016 10:59 IST|Sakshi

న్యూఢిల్లీ : దేశంలో పప్పుధరలు కొండెక్కనున్నాయా..? అంటే అవుననే సంకేతాలు వచ్చాయి. కొన్ని నెలల్లోనే ఈ ధరల మోత సాధారణ వినియోగదారుడిపై పడనుందని తెలిసింది. దీంతో పప్పు ధాన్యాల ధరలు మండకుండా ఉండేందుకు కేంద్రప్రభుత్వం ఉపశమన చర్యలు ప్రారంభించింది. పప్పుధాన్యాలపై స్థానిక పన్నులు వ్యాట్ లాంటివి వేయొద్దని రాష్ట్రప్రభుత్వాలను కేంద్రప్రభుత్వం ఆదేశించింది. అదేవిధంగా పప్పుధాన్యాలను మార్కెట్లోకి విడుదలచేయకుండా అక్రమంగా నిల్వలకు పాల్పడే వారిపై కఠినచర్యలు తీసుకోవాలని పేర్కొంది. అక్రమ నిల్వలను నిరోధించి, సప్లై పెంచి ధరలను అదుపులో ఉంచాలని కేంద్ర ఆహార మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ తెలిపారు. ప్రస్తుతమున్న 1.5లక్షల టన్నుల పప్పు ధాన్యాల నిల్వలను, 9లక్షల టన్నులకు పెంచాలని నిర్ణయించినట్టు మంత్రి చెప్పారు.

స్థానిక పన్నులను తగ్గించడమే కాకుండా.. రాష్ట్రాలు సొంతంగా ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటుచేసుకోవాలని పాశ్వాన్ ఆదేశించారు. దీనివల్ల పెరిగిన ధరల భారం నుంచి వినియోగదారులకు ఉపశమనం కల్పించవచ్చన్నారు. గత రెండేళ్లగా ఏర్పడిన కరువు నేపథ్యంలో పప్పు ధాన్యాల డిమాండ్ - సప్లైలకు అంతరం ఏర్పడిందని, ఉత్పత్తి 170లక్షల టన్నులుంటే, డిమాండ్ 236లక్షల టన్నులున్నట్టు పాశ్వాన్ చెప్పారు. 55లక్షల టన్నుల పప్పులను 2015-16 ఏడాదిలో భారత్ దిగుమతి చేసుకుందని, అయినప్పటికీ ఇంకా 10లక్షల టన్నుల కొరత ఏర్పడిందన్నారు. ఈ కొరతనే ధరల పెరగడానికి దోహదం చేస్తుందని చెప్పారు. ప్రజలకు అందుబాటులోకి తెచ్చే పప్పుధాన్యాల్లో ట్రేడర్స్ ఎలాంటి అక్రమాలకు పాల్పడకుండా, పారదర్శకతతో అందించాలని పాశ్వాన్ పేర్కొన్నారు. మార్కెట్లోకి విడుదలయ్యే ఉత్పత్తిని, డిమాండ్ ను, ధరల పెరుగుదలను వెంటవెంటనే అంచనా వేసి, ధర పెరుగుదలను నియంత్రించడానికి కేంద్రప్రభుత్వం ప్రైవేట్ ఏజెన్సీల సహాయం తీసుకోనుంది.

>
మరిన్ని వార్తలు