బ్యాంకులకు 48వేల కోట్లు

21 Feb, 2019 01:01 IST|Sakshi

12 ప్రభుత్వ రంగ బ్యాంకులకు అదనపు మూలధనం

కార్పొరేషన్‌ బ్యాంక్‌కు అత్యధికం

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 12 ప్రభుత్వ రంగ బ్యాంకులకు(పీఎస్‌బీ) రూ.48,239 కోట్ల అదనపు మూలధనాన్ని సమకూరుస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ బుధవారం వెల్లడించింది. ఆయా బ్యాంకులు నియంత్రణ సంస్థ నిర్దేశిత మూలధన నిల్వల నిబంధనలు పాటించేందుకు, వృద్ధి ప్రణాళికలను అమలు చేసేందుకు ఈ నిధులు తోడ్పడగలవని పేర్కొంది. తాజా నిధులతో కలిపి రూ.1.06 లక్షల కోట్ల రీక్యాపిటలైజేషన్‌ ప్రణాళిక కింద ఈ ఆర్థిక సంవత్సరంలో పీఎస్‌బీలకు మొత్తం రూ.1,00,958 కోట్లు ఇచ్చినట్లవుతుందని కేంద్ర ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి రాజీవ్‌ కుమార్‌ తెలిపారు. ప్రస్తుతం దేనా బ్యాంక్, విజయా బ్యాంక్‌లను విలీనం చేసుకుంటున్న బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా అవసరాల నిమిత్తం రూ.5,000 కోట్లు పక్కన పెట్టినట్లు ఆయన వివరించారు.  

ప్రభుత్వం నుంచి ఈ విడతలో కార్పొరేషన్‌ బ్యాంక్‌కు అత్యధికంగా నిధులు లభించనున్నాయి. రూ.9,086 కోట్లు దక్కనున్నాయి. అటు అలహాబాద్‌ బ్యాంక్‌కు రూ.6,896 కోట్లు సమకూర్చనున్నట్లు రాజీవ్‌ కుమార్‌ తెలిపారు. ఇవి ప్రస్తుతం భారీ మొండిబాకీల కారణంగా ఆర్‌బీఐ పర్యవేక్షణలో సత్వర దిద్దుబాటు చర్యలపరమైన (పీసీఏ) ఆంక్షల పరిధిలో ఉన్నప్పటికీ కొంత మెరుగ్గా రాణిస్తున్నాయని పేర్కొన్నారు. తాజాగా మరింత మూలధనం లభించడం వల్ల వీటి మొండిబాకీల నిష్పత్తి మెరుగుపడగలదని తెలిపారు. బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు రూ.4,638 కోట్లు, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్రకు రూ.205 కోట్లు లభించనున్నాయి. ఇవి రెండూ ఇటీవలే పీసీఏ పరిధి నుంచి బైటికొచ్చాయి.  

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌కు మరిన్ని.. 
ఇక పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌కు రూ.5,908 కోట్లు, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు రూ.4,112 కోట్లు, ఆంధ్రా బ్యాంక్‌కు రూ.3,256 కోట్లు, సిండికేట్‌ బ్యాంక్‌కు రూ. 1,603 కోట్లు లభించనున్నాయి. పీసీఏ పరిధిలో ఉన్న మరో నాలుగు బ్యాంకులకు (సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, యునైటెడ్‌ బ్యాంక్, యూకో బ్యాంక్, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌) రూ.12,535 కోట్లు అందనున్నాయి. డిసెంబర్‌లో పీఎస్‌బీలకు సమకూర్చనున్న మొత్తాన్ని రూ.41,000 కోట్ల మేర పెంచాలని కేంద్రం నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రీక్యాపిటలైజేషన్‌ ప్రణాళిక పరిమాణం రూ.65,000 కోట్ల నుంచి రూ. 1.06 లక్షల కోట్లకు చేరింది. ఇందులో భాగంగా డిసెంబర్‌లో రీక్యాపిటలైజేషన్‌ బాండ్ల ద్వారా ఏడు ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేంద్రం రూ. 28,615 కోట్లు సమకూర్చింది.పీసీఏ పరిధి నుంచి బైటికి రావడానికి తాజాగా అందే అదనపు మూలధనం తోడ్పడుతుందని కార్పొరేషన్‌ బ్యాంక్‌ ఎండీ పి.వి. భారతి చెప్పారు. పరిస్థితులను బట్టి అదనంగా ప్రొవిజనింగ్‌ చేయాల్సి వస్తే ఈ నిధులను వినియోగించుకుంటామని, తమ నికర ఎన్‌పీఏలు 6 శాతం లోపునకు తగ్గుతాయని ఆమె తెలిపారు. వీటి ఊతంతో ఈ మార్చి క్వార్టర్‌లోనే పీసీఏ పరిధి నుంచి బైటపడగలమని భారతి వివరించారు. 

మరిన్ని వార్తలు