టెలికం ప్యాకేజీపై కమిటీ రద్దు

26 Nov, 2019 05:49 IST|Sakshi

మారటోరియం నేపథ్యంలో కేంద్రం నిర్ణయం

న్యూఢిల్లీ: స్పెక్ట్రం చార్జీలు చెల్లించడానికి కేంద్రం మారటోరియం రూపంలో వెసులుబాటు కల్పించిన నేపథ్యంలో టెలికం రంగ సమస్యలను అధ్యయనం చేసేందుకు ఏర్పాటైన కార్యదర్శుల కమిటీ (సీవోఎస్‌) రద్దయింది. టెలికం రంగానికి ఊతమిచ్చేలా ప్రభుత్వం తీసుకోతగిన చర్యలపై పలు మార్లు సమావేశమైన సీవోఎస్‌ ఈ నెల తొలినాళ్లలో కేంద్రానికి నివేదిక ఇచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కమిటీ సిఫార్సుల మేరకే స్పెక్ట్రం యూసేజీ చార్జీల చెల్లింపుపై రెండేళ్ల మారటోరియం విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వివరించాయి. లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల బాకీల చెల్లింపునకు సంబంధించి సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో కేంద్రం జోక్యం చేసుకోరాదని భావించిన నేపథ్యంలో సీవోఎస్‌ రద్దు ప్రాధాన్యం సంతరించుకుంది.

సంక్షోభం నుంచి బయటపడేందుకు కలిసికట్టుగా కృషి చేయాలని, వాయిస్‌ కాల్స్‌.. డేటా టారిఫ్‌లను పెంచడం మొదలైన అన్ని మార్గాల్లో ప్రయత్నాలు చేయాలని టెలికం సంస్థలకు  ప్రభుత్వం సూచించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్‌) అంశంపై ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పునివ్వడంతో టెల్కోలు దాదాపు రూ. 1.4 లక్షల కోట్లు కేంద్రానికి చెల్లించాల్సి ఉన్న సంగతి తెలిసిందే. టెలికం రంగానికి ఇది మరింత భారమవుతుందని, తోడ్పాటు అందించాలని కేంద్రాన్ని టెల్కోలు కోరుతున్నాయి. భారతి ఎయిర్‌టెల్, వొడాఫోన్‌ ఐడియా సంస్థలు.. సుప్రీం ఉత్తర్వులపై అదే కోర్టులో రివ్యూ పిటీషన్‌ కూడా దాఖలు చేశాయి.

మరిన్ని వార్తలు