సీఎస్‌ఆర్ నిబంధనలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి

28 Feb, 2014 01:07 IST|Sakshi
సీఎస్‌ఆర్ నిబంధనలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి

న్యూఢిల్లీ: దేశంలో తీవ్ర చర్చనీయాంశంగా నిలిచి, ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్‌ఆర్) నిబంధనలు కార్యరూపం దాల్చనున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి వీటిని అమలు చేసేలా కేంద్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ(నోటిఫై) చేసింది. కొత్త కంపెనీల చట్టం-2013లో భాగంగా నిబంధనలను తీసుకొచ్చారు. దీని ప్రకారం కార్పొరేట్ కంపెనీలు ఇక నుంచి సామాజిక పురోభివృద్ధికి దోహదపడే ప్రాజెక్టులకు నిధులను తప్పనిసరిగా వెచ్చించడం, ఇతరత్రా కార్యకలాపాలను చేపట్టాల్సి ఉంటుంది.

అన్ని వర్గాల నుంచి అభిప్రాయసేకరణ, విసృ్తత చర్చల తర్వాతే ఈ నిబంధనలను ఖరారు చేశామని కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి సచిన్ పైలట్ ఒక అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, సీఎస్‌ఆర్ వ్యయంపై పన్ను రాయితీలు ఇవ్వాలని ఆర్థిక మంత్రిత్వ శాఖను కార్పొరేట్ వ్యవహారాల శాఖ ఇదివరకే కోరింది. అయితే, దీనిపై ఏ నిర్ణయం తీసుకున్నారనేది ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. కంపెనీలకు ప్రశ్నార్థకంగా మారిన చాలా అంశాలకు ఈ నిబంధనలతో స్పష్టత లభించిందని కన్సల్టెన్సీ సంస్థ కేపీఎంజీ ఇండియా టెక్నికల్ అడ్వయిజర్ సంతోష్ జయరామ్ అభిప్రాయపడ్డారు.

 నిబంధనల సారాంశమిదీ...
  సీఎస్‌ఆర్ నిబంధనల ప్రకారం సామాజిక సంక్షేమ కార్యకలాపాలకు కంపెనీలు తప్పకుండా తమ లాభాల్లో కొంత మొత్తాన్ని వెచ్చించాల్సి ఉంటుంది.

  మూడేళ్ల సగటు వార్షిక లాభాల ఆధారంగా ప్రతి ఆర్థిక సంవత్సరం లాభాల్లో కనీసం 2 శాతాన్ని సీఎస్‌ఆర్‌కు ఖర్చుచేయాలి. కనీసం 500 కోట్ల నెట్‌వర్త్ లేదా రూ.1,000 కోట్ల టర్నోవర్ లేదా కనీసం రూ. 5 కోట్ల నికర లాభాన్ని ఆర్జిస్తున్న కంపెనీలన్నీ సీఎస్‌ఆర్‌కు కచ్చితంగా వ్యయం చేయాల్సి వస్తుంది. 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి ఇది అమల్లోకి వస్తున్నట్లు లెక్క.

  దేశంలోనే ఈ సీఎస్‌ఆర్ కార్యకలాపాలు చేపట్టాలి. భారత్‌లో రిజిస్టర్ అయిన విదేశీ కంపెనీలకు సైతం ఈ నిబంధనలు వర్తిస్తాయి.
  కాగా, విదేశీ శాఖల నుంచి లభించే లాభాలు, దేశీయంగా ఉన్న ఇతర అనుబంధ కంపెనీల నుంచి వచ్చే డివిడెండ్‌లను సీఎస్‌ఆర్ విషయంలో ఒక కంపెనీ నికర లాభాలను లెక్కించేటప్పుడు పరిగణనలోకి తీసుకోకుండా వెసులుబాటు ఇచ్చారు.

 రిజిస్టర్డ్ ట్రస్ట్ లేదా సొసైటీ లేదా ప్రత్యేక కంపెనీ ద్వారా కూడా కంపెనీలు సీఎస్‌ఆర్ కార్యకలాపాలను నిర్వహించుకోవచ్చు.

  అదేవిధంగా సీఎస్‌ఆర్ కార్యకలాపాల కోసం ఇతర కంపెనీలతో భాగస్వామ్యాన్ని కూడా ఏర్పాటుచేసుకోవచ్చు. అయితే, ఇలాంటి ప్రాజెక్టుల్లో వ్యయాన్ని ప్రత్యేకంగా చూపించాల్సి ఉంటుంది.

  సీఆర్‌ఆర్ ప్రాజెక్టులు/కార్యకలాపాలు/ప్రోగ్రామ్స్‌కు కేటాయించిన నిధుల్లో మిగులును కంపెనీలు తిరిగి తమ వ్యాపార లాభాల్లోకి మళ్లించబోమని సీఎస్‌ఆర్ పాలసీల్లో హామీనివ్వాల్సి ఉంటుంది.

  సీఎస్‌ఆర్ పనుల కోసం కంపెనీలు ప్రత్యేకంగా సిబ్బందిని నియమించుకోవచ్చు. అయితే, ఈవిధమైన సిబ్బందిపై వ్యయం ఒక ఆర్థిక సంవత్సరంలో మొత్తం సీఎస్‌ఆర్ ఖర్చులో 5 శాతం వరకూ మాత్రమే అనుమతిస్తారు.
  తాజా నిబంధనల అమలులో పారదర్శకత కోసం కంపెనీలు సీఎస్‌ఆర్ కార్యకలాపాల ద్వారా చేపట్టిన పనులను తమ వెబ్‌సైట్‌లలో పొందుపరచాల్సి ఉంటుంది.
  అయితే, రాజకీయ పార్టీలకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఇచ్చే విరాళాలు, నిధులు; కంపెనీలోని సొంత సిబ్బంది(వారి కుటుంబ సభ్యులు సహా) ప్రయోజనాల కోసం వెచ్చించిన సొమ్ము ఈ సీఎస్‌ఆర్ వ్యయం కిందికి రాదు.

 ఈ విధానం పర్యవేక్షణ కోసం ఒక ప్రత్యేక సీఎస్‌ఆర్ కమిటీని కంపెనీలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. సీఎస్‌ఆర్ కింద ఏ పనులు చేపట్టాలి... నిబంధనల అమలు వంటివన్నీ ఈ కమిటీతో చర్చించి నిర్ణయం తీసుకోవాలి. ఆతర్వాత కంపెనీ డెరైక్టర్ల బోర్డు ఆమోదించాకే ఖర్చు చేయాలి.
 
 ఏ పనులను చేపట్టొచ్చు...
   దేశ సంస్కృతి-సంప్రదాయాల(చరిత్రాత్మక ప్రాధాన్యం ఉన్న పురాతన కట్టడాలు, ప్రాంతాలు, కళల సంరక్షణ, పునరుద్ధరణ వంటివి) పరిరక్షణ చర్యలు, ప్రజలకోసం గ్రంథాలయాల ఏర్పాటు, సంప్రదాయ కళలు, హస్తకళాకృతుల అభివృద్ధి-ప్రోత్సాహానికి పాటుపడే పనులు కంపెనీల సీఎస్‌ఆర్ కార్యకలాపాల్లోకి వస్తాయి.

  గ్రామీణాభివృద్ధి, సోమాజికాభివృద్ధి ప్రాజెక్టులు; ఆరోగ్య సంరక్షణ, సురక్షితమైన తాగునీటి కల్పన, పారిశుధ్య పనులు.

  సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఎదురవుతున్న అసమానతల తగ్గింపు లక్ష్యంగా చేపట్టే విభిన్న కార్యక్రమాలు.

 మాజీ సైనికోద్యోగులు, యుద్ధంలో భర్తను కోల్పోయిన వితంతువులు, వాళ్ల కుటుంబీకులకు చేదోడుగా నిలిచే చర్యలు.

  మహిళలు, అనాథలకు ఇళ్లు, హాస్టళ్ల ఏర్పాటు; వయసు మళ్లిన వారికోసం ప్రత్యేక వసతుల(ఓల్డేజ్ హోమ్స్, డే కేర్ సెంటర్లు వంటివి) కల్పన.
  ఆగ్రో-ఫారెస్ట్రీ, అడవుల పరిరక్షణ, పర్యావరణ సమతుల్యతను కాపాడటం, పశు సంవర్థకం, సహజ వనరుల సంరక్షణ; నీరు-గాలి-మట్టి నాణ్యతను కాపాడే చర్యలు.

  గ్రామీణ ఆటలు, జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన క్రీడలు, పారాలింపిక్(అంగవైకల్యం ఉన్నవాళ్లకు) స్పోర్ట్స్, ఒలింపిక్ స్పోర్ట్స్‌కు ప్రోత్సాహం, శిక్షణ కార్యక్రమాలు, ఇతరత్రా.

>
మరిన్ని వార్తలు