ఆధార్‌ లింక్‌పై కేంద్రం మరో గుడ్‌న్యూస్‌ 

13 Dec, 2017 15:03 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఆధార్‌ అనుసంధానంపై కేంద్రం మరో గుడ్‌న్యూస్‌ చెప్పింది. బ్యాంకు అకౌంట్లకు ఆధార్‌ నెంబర్‌ను లింక్‌ చేసుకునే డెడ్‌లైన్‌ డిసెంబర్‌ 31ను విత్‌డ్రా చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. కొత్త డెడ్‌లైన్‌ను కేంద్రం త్వరలోనే ప్రకటించనున్నట్టు పేర్కొంది. ప్రస్తుతమైతే డిసెంబర్‌ 31గా ఉన్న తుది గడువును ప్రభుత్వం ఉపసంహరించుకుంది. అన్ని బ్యాంకు అకౌంట్లకు ఆధార్‌ అనుసంధానం తప్పనిసరి అని ప్రభుత్వం పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే మిగతా అన్ని సర్వీసులకు ఆధార్‌ను అనుసంధానించే తుది గడువుల్లో ఎలాంటి మార్పు లేదు. 

పాన్‌ నెంబర్‌ను ఆధార్‌ నెంబర్‌తో అనుసంధానించే తుది గడువు 2018 మార్చి 31 వరకు ఉండగా.. మొబైల్‌ నెంబర్లను ఆధార్‌తో లింక్‌ చేసుకునే తుది గడువు 2018 ఫిబ్రవరి 6తో ముగియనుంది. ప్రభుత్వం అందించే అన్ని సామాజిక భద్రత, సంక్షేమ పథకాలకు సంబంధిత అధికార విభాగాలకు ఆధార్‌ వివరాలను అందించే ప్రక్రియకు తుది గడువు 2017 డిసెంబర్‌ 31గా ఉంది. అదేవిధంగా ఆధార్‌, పాన్‌ను ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌తో లింక్‌ చేసే ప్రక్రియను మార్చి 31 వరకు చేపట్టవచ్చని పేర్కొంది. ఇప్పటి వరకు ఆధార్‌ కార్డు పొందని వారి కోసం, ఇటీవలే ఆధార్‌ నెంబర్‌ అనుసంధానం చేసే గడువును 2018 మార్చి 31వ తేదీ వరకు పొడిగించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు