ఏజీఆర్‌ ‘పరిష్కారం’పై వొడా–ఐడియా కసరత్తు..

19 Feb, 2020 07:54 IST|Sakshi

టెలికం కార్యదర్శితో చైర్మన్‌ బిర్లా భేటీ

న్యూఢిల్లీ: ఏజీఆర్‌ బాకీల కారణంగా దివాలా తీసే పరిస్థితుల్లో ఉన్న టెలికం సంస్థ వొడాఫోన్‌ ఐడియా (వీఐఎల్‌) .. ఈ సమస్య నుంచి గట్టెక్కడంపై కసరత్తు చేస్తోంది. కంపెనీ చైర్మన్‌ కుమార మంగళం బిర్లా .. మంగళవారం కేంద్ర టెలికం శాఖ కార్యదర్శి అన్షు ప్రకాష్‌తో సమావేశమయ్యారు. దాదాపు గంటపాటు సాగిన చర్చల్లో వొడాఫోన్‌ ఐడియా ఎండీ, సీఈవో రవీందర్‌ టక్కర్‌ కూడా పాల్గొన్నారు. అయితే, చర్చల సారాంశాన్ని వెల్లడించేందుకు బిర్లా నిరాకరించారు. ‘ఇప్పుడే ఏం చెప్పలేము‘ అంటూ భేటీ అనంతరం ఆయన వ్యాఖ్యానించారు.

వీఐఎల్‌ సంస్థ ఏజీఆర్‌ బాకీలు కట్టగలదా, దివాలా ప్రకటించే అవకాశం ఉందా వంటి ప్రశ్నలకు ఆయన సమాధానమివ్వడానికి నిరాకరించారు. సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్‌) లెక్కల ప్రకారం లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల కింద టెల్కోలు దాదాపు రూ. 1.47 లక్షల కోట్లు కట్టాలంటూ టెలికం శాఖ డిమాండ్‌ చేస్తోంది. వీఐఎల్‌ సుమారు రూ. 53,000 కోట్లు కట్టాల్సి ఉంది. బాకీల చెల్లింపుల్లో ఆదేశాల ఉల్లంఘనపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో మిగతా టెల్కోలతో పాటు వీఐఎల్‌ సోమవారం రూ. 2,500 కట్టింది. మరో వారం రోజుల్లోగా ఇంకో రూ. 1,000 కోట్లు కడతామని పేర్కొంది. మరోవైపు, బాకీలు కట్టని టెల్కోల బ్యాంకు గ్యారంటీలను స్వాధీనం చేసుకోవాలని టెలికం శాఖ భావిస్తోంది. అదే జరిగితే వీఐఎల్‌ వంటివి మూతబడే ప్రమాదముంది. బాకీలపై వెసులుబాటు లభించకపోతే మూసివేత తప్పదంటూ బిర్లా గతంలోనే వ్యాఖ్యానించడం గమనార్హం.

>
మరిన్ని వార్తలు