మనకు పెట్రో ఊరట లేనట్టే! 

22 Apr, 2020 03:07 IST|Sakshi

న్యూఢిల్లీ: అమెరికాలో ఒకపక్క క్రూడ్‌ ధర మైనస్‌లోకి పడిపోయినప్పటికీ... దేశీయంగా పెట్రోలు, డీజిల్‌ ధరలు మాత్రం భారీగా దిగొచ్చే పరిస్థితి లేదా? ప్రభుత్వ రంగ చమురు రిటైలర్లు(ఓఎంసీ) ఇదే మాట చెబుతున్నారు. ఎందుకంటే మనం కేవలం అమెరికా క్రూడ్‌ను మాత్రమే దిగుమతి చేసుకోమని.. దేశీ ధరలను బ్రెంట్‌ క్రూడ్‌(ప్రస్తుతం బ్యారెల్‌ 25 డాలర్ల స్థాయిలో ఉంది) ఇతరత్రా విభిన్న ప్రామాణిక రేట్ల ప్రకారం నిర్ణయించడమే దీనికి కారణమనేది వారి వాదన. ఇప్పటికే రిఫైనరీలన్నీ భారీ నిల్వలతో నిండిపోయాయని కూడా చెబుతున్నారు. కాగా, కేవలం ఫ్యూచర్స్‌ ట్రేడింగ్‌లో మే నెల కాంట్రాక్టులకు డెలివరీ స్టోరేజీ లేకపోవడం వల్లే ఇలా అమెరికా క్రూడ్‌ ధర మైనస్‌లోకి కుప్పకూలిందని ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌(ఐఓసీ) చైర్మన్‌ సంజీవ్‌ సింగ్‌ పేర్కొన్నారు.

చమురు ధర ఇలా కనిష్ట స్థాయికి పడిపోవడం స్వల్పకాలంలో ప్రయోజనకరమే అయినప్పటికీ, దీర్ఘకాలంలో మాత్రం ఆయిల్‌ ఎకానమీ తీవ్రంగా దెబ్బతింటుందని ఆయన అభిప్రాయపడ్డారు. క్రూడ్‌ ఉత్పత్తిదారులకు పెట్టుబడులకు నిధుల్లేక అన్వేషణ, ఉత్పత్తి కార్యకలాపాలు దిగజారుతాయన్నారు. అయితే, అంతర్జాతీయంగా క్రూడ్‌ ధర భారీగా పడిపోయినప్పటికీ మార్చి 16 నుంచి ఇప్పటిదాకా మనదగ్గర రిటైల్‌ చమురు ధరల్లో ఎలాంటి తగ్గింపూ ఎందుకు లేదన్నదానిపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు. నిజానికి ధరలు తగ్గించకపోగా, రూ.3 ఎక్సైజ్‌ సుంకం, బీఎస్‌–6 ప్రమాణాలంటూ మరో రూ.1 చొప్పున అదనపు భారాన్ని ఈ నెల 1 నుంచి ప్రజలపై ఓఎంసీలు వడ్డించాయి. ఢిల్లీలో లీటరు పెట్రోలు ప్రస్తుతం రూ.69.59, డీజిల్‌ రూ.62.29 రేటుకు విక్రయిస్తున్నారు.

మరిన్ని వార్తలు