30 ఏళ్ల... ‘చంద్ర’యాన్‌

13 Jan, 2017 01:21 IST|Sakshi
30 ఏళ్ల... ‘చంద్ర’యాన్‌

కాలేజీ నుంచి టీసీఎస్‌ ఉద్యోగానికి
కెరీర్‌ మొత్తం అక్కడే; ఇపుడు గ్రూపు చైర్మన్‌గా
నా సామర్థ్యానికి గౌరవమిది: చంద్రశేఖరన్‌
 
పూర్తిపేరు నటరాజన్‌ చంద్రశేఖరన్‌. అందరూ పిలిచేది మాత్రం చంద్ర... అనే. వయసు 54  ఏళ్లు. తమిళనాడులోని తిరుచ్చి రీజినల్‌ ఇంజనీరింగ్‌ కళాశాల నుంచి కంప్యూటర్‌ అప్లికేషన్స్‌లో మాస్టర్‌ డిగ్రీ పూర్తి చేసి బయటకొచ్చిన తరవాత ఆయన ఎంచుకున్నది టీసీఎస్‌నే. తన పూర్తి సామర్థ్యాన్ని కంపెనీకే ధారపోసిన చంద్రశేఖరన్‌... 2009 నాటికి టీసీఎస్‌ ఎండీ, సీఈవో స్థాయికి చేరుకున్నారు. 2014లో ఐదేళ్ల పదవీ కాలం ముగిసినా... రెండోసారీ దక్కించుకున్నారు. గతేడాది అక్టోబర్‌ 24న సైరస్‌ మిస్త్రీకి ఉద్వాసన పలికిన మర్నాడే చంద్రశేఖరన్‌ను టాటా సన్స్‌ డైరెక్టర్ల బోర్డులోకి తీసుకున్నారు. తాజాగా ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ బాధ్యతలకు ఎంపిక చేశారు.

టీసీఎస్‌ విజయం వెనక ‘చంద్ర’
చంద్రశేఖరన్‌ విషయంలో చెప్పుకోవాల్సింది ఒకటుంది. ఇప్పటిదాకా టాటా సన్స్‌ పగ్గాలు దక్కించుకున్నది టాటాల కుటుంబీకులు... లేదా వాటాదారులు మాత్రమే. ఒక ఉద్యోగికి ఈ స్థాయి దక్కటం ఇదే తొలిసారి కూడా. రతన్‌ టాటా సోదరుడు నోయెల్‌ టాటా, జేఎల్‌ఆర్‌కు చెందిన రాల్ఫ్‌ స్పెత్, పెప్సీకో సీఈవో ఇంద్రా నూయి తదితరులతో పోటీ పడి మరీ అగ్ర పీఠాన్ని దక్కించుకున్నారు. విశేషమేంటంటే ఒకదశలో టాటా అగ్రపీఠానికి టీసీఎస్‌ మాజీ సీఈఓ రామదురై పేరు కూడా వినిపించింది. టీసీఎస్‌ ఎండీ కావటానికి ముందు... నాటి సీఈవో రామదొరైకు సహాయకుడిగా చంద్ర సేవలందించారు కూడా.

రెండు దశాబ్దాల కాలంలో ప్రత్యర్థి కంపెనీలను దాటుకుని దేశీయ అగ్రగామి ఐటీ కంపెనీగా టీసీఎస్‌ అవతరించడం, రూ.5 లక్షల కోట్ల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌తో టాటా గ్రూపునకు కల్పవృక్షంగా మారటం వెనక చంద్ర కృషి చాలా ఉంది. ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని ఆయన టీసీఎస్‌ను అగ్రగామిని చేశారు. టాటా గ్రూపు లాభాల్లో 80 శాతానికి పైగా టీసీఎస్‌ నుంచే వస్తుండటం గమనార్హం. 2015లో ఐటీ సేవల్లో ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన బ్రాండ్‌గా టీసీఎస్‌ ఖ్యాతిని సొంతం చేసుకుంది కూడా. 2015–16లో 16.5 బిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని ఈ కంపెనీ ఆర్జించింది. దేశంలో 3.78 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది కూడా.

సానుకూలతలే కాదు... సవాళ్లూ ఉన్నాయ్‌
టీసీఎస్‌లో సుదీర్ఘ అనుభవం, గ్రూపునకు ఆశాకిరణంగా కనిపిస్తున్న జేఎల్‌ఆర్‌లు చంద్రకు సానుకూలాంశాలు. అయితే గ్రూపులోని పలు కంపెనీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి గాడిన పెట్టడం పెద్ద సవాలే. చంద్రకు భార్య లలిత, కుమారుడు ప్రణవ్‌ ఉన్నారు. ఇండో–యూఎస్, భారత్‌–బ్రిటిష్‌ సీఈవోల ఫోరంలో చంద్ర కీలక పాత్ర పోషిస్తున్నారు. ఐటీ పరిశ్రమ అసోసియేషన్‌ నాస్కామ్‌కు 2012–13లో చైర్మన్‌గా పనిచేశారు.

మార్పు దశలో టాటా...: చంద్రశేఖరన్‌
టాటా గ్రూపు మార్పు దశలో ఉందని ఆ గ్రూపు కొత్త ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా ఎంపికైన చంద్రశేఖరన్‌ అన్నారు. టాటాలు సృష్టించిన విలువలు, నైతికత, సంస్కృతితో గ్రూపును ప్రగతి దిశగా నడిపించడమే తన కర్తవ్యమన్నారు. టాటా సన్స్‌ తనను చైర్మన్‌గా ఎంపిక చేసిన నేపథ్యంలో ఆయన స్పందిస్తూ ‘‘కొత్త పాత్ర ఎన్నో బాధ్యతలతో కూడుకున్నదని నాకు తెలుసు. దేశ ప్రజల్లో సమున్నత స్థానాన్ని ఆక్రమించిన ఓ గొప్ప సంస్థను నడిపించేందుకు నన్ను ఎంపిక చేయడం గౌరవంగా భావిస్తున్నా. టాటా గ్రూపుతో 30 ఏళ్ల పాటు కలసి నడుస్తూ ఈ స్థాయికి చేరుకోవడం చాలా గర్వంగా ఉంది’’ అన్నారాయన.

మరిన్ని వార్తలు