కొచర్‌కు ‘సెలవు’... కొత్త బాస్‌గా సందీప్‌ బక్షి

19 Jun, 2018 01:10 IST|Sakshi

సీవోవోగా నియమిస్తూ ఐసీఐసీఐ బ్యాంక్‌ బోర్డు నిర్ణయం

బ్యాంకు అన్ని వ్యాపారాలకు ఆయనే సారథి

నేడే బాధ్యతల స్వీకరణ

విచారణ ముగిసే వరకూ చందా కొచర్‌ సెలవుపైనే

ప్రకటించిన ఐసీఐసీఐ బ్యాంకు

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌కు ఎండీ, సీఈవోగా కన్నన్‌

న్యూఢిల్లీ: వీడియోకాన్‌ గ్రూపునకు రుణాల మంజూరు వెనుక ఆర్థిక ప్రయోజనాలు ముట్టాయన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐసీఐసీఐ బ్యాంకు సీఈవో, ఎండీ చందా కొచర్‌... ఈ అంశంపై బ్యాంకు స్వతంత్రంగా చేపట్టిన విచారణ పూర్తయ్యే వరకు సెలవుపైనే కొనసాగాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని ఐసీఐసీఐ బ్యాంకు బోర్డు ప్రకటించింది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఎండీ, సీఈవోగా పనిచేస్తున్న సందీప్‌ భక్షి ఐసీఐసీఐ బ్యాంకు చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ (సీవోవో)గా రంగ ప్రవేశం చేయనున్నారు. ఆయన్ను సీవోవోగా ఎంపిక చేస్తూ సోమవారం సమావేశమైన ఐసీఐసీఐ బ్యాంకు డైరెక్టర్ల బోర్డు నిర్ణయం తీసుకుంది.

ఈ నెల 19నే (మంగళవారం) సీవోవోగా సందీప్‌ భక్షి బాధ్యతలు చేపడతారని బ్యాంకు తెలిపింది. ఈ నియామకం వివిధ అనుమతులకు లోబడి ఉంటుందని స్పష్టం చేసింది. ‘‘ఐసీఐసీఐ బ్యాంకు అన్ని వ్యాపారాలను భక్షి పర్యవేక్షించనున్నారు. అలాగే, బ్యాంకు కార్పొరేట్‌ కార్యకలాపాలను కూడా ఆయనే చూస్తారు. ఐసీఐసీఐ బ్యాంకు బోర్డు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు అందరూ, ఎగ్జిక్యూటివ్‌ మేనేజ్‌మెంట్‌ సైతం ఆయనకే రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుంది’’ అని ఐసీఐసీఐ బ్యాంకు తెలిపింది.

బ్యాంకు ఎండీ, సీఈవో అయిన చందా కొచర్‌కు భక్షి రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుందని, అయితే, కొచర్‌ సెలవు కాలంలో భక్షి బ్యాంకు బోర్డుకు రిపోర్ట్‌ చేస్తారని తెలియజేసింది. ఇక భక్షి స్థానంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఎండీ, సీఈవోగా ఎన్‌ఎస్‌ కన్నన్‌ నియామకానికి బ్యాంకు బోర్డు సిఫారసు చేసింది. వీడియోకాన్‌ గ్రూపునకు రుణం మంజూరులో చందాకొచర్‌ కుటుంబానికి ఆర్థిక ప్రయోజనాలు ముట్టాయంటూ ఆరోపణలు రావడంతో ఐసీఐసీఐ బ్యాంకు గత నెలలోనే దీనిపై స్వతంత్ర విచారణ నిర్వహించనున్నట్టు ప్రకటించడం తెలిసిందే.

మరిన్ని వార్తలు