కీలక సూచీల బేస్‌ ఇయర్‌ మార్పు!

7 Mar, 2017 01:25 IST|Sakshi
కీలక సూచీల బేస్‌ ఇయర్‌ మార్పు!

2004–05 నుంచి 2011–12కు జంప్‌
ఏప్రిల్‌ నుంచే కొత్త బేస్‌ ప్రకారం ఐఐపీ, టోకు ధరల సూచీ గణాంకాల విడుదల  


న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ), టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం విషయంలో ప్రస్తుతం అనుసరిస్తున్న బేస్‌ ఇయర్‌ను ఏప్రిల్‌ నుంచీ మార్చనున్నట్లు అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం 2004–05గా ఉన్న బేస్‌ ఇయర్‌ను 2011–12కు మార్చడానికి మదింపు జరుగుతున్నట్లు అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. మార్చి 14వ తేదీన క్యాబినెట్‌ సెక్రటరీ నేతృత్వంలో జరిగే సీనియర్‌ అధికారుల సమావేశంలో ఇందుకు సంబంధించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని   కేంద్ర గణాంకాల సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ జీసీ మన్నా తెలిపారు.

ఫిబ్రవరి గణాంకాలకు వర్తింపు..!
ఏప్రిల్‌ నాటికి ఐఐపీ, డబ్ల్యూపీఐలకు సంబంధించి బేస్‌ ఇయర్‌ను మార్చడానికి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు మన్నా తెలిపారు. ఇదే జరిగితే, ఫిబ్రవరి ఐఐపీ, డబ్ల్యూపీఐ గణాంకాలు కొత్త బేస్‌ ఇయర్‌తో ఏప్రిల్‌లో వెలువడే వీలుంది.

బేస్‌ ఇయర్‌ అంటే..
గడచిన కొన్ని సంవత్సరాల క్రితం– ఒక నిర్దేశిత సంవత్సరంలో ఉన్న ఉత్పత్తి లేదా ధరలను ప్రమాణంగా తీసుకుని, ప్రస్తుతం జరుగుతున్న ఉత్పత్తి లేదా ధరలను లెక్కిస్తారు. వార్షిక మార్పులను లెక్కిస్తూ... ఇందుకు అనుగుణంగా శాతాలను నిర్ణయిస్తారు. ఇక్కడ ప్రమాణంగా తీసుకునే మూల సంవత్సరాన్నే బేస్‌ ఇయర్‌గా పరిగణిస్తారు. ఇక్కడి బేస్‌ ప్రమాణంగా ఏడాదికి ఆయేడాదిగా ధరల మార్పునకు అనుగుణంగా శాతాలను నిర్ణయిస్తారు. ఆర్థిక క్రియాశీలత, గణాంకాల్లో పారదర్శకత, స్పష్టత కోసం సాధారణంగా 10 లేదా 5 సంవత్సరాలకు ఒకసారి బేస్‌ ఇయర్‌ మారుతుంటుంది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)కి సంబంధించి ఇప్పటికే కేంద్రం బేస్‌రేటులో మార్పు చేసింది.

మరిన్ని వార్తలు