తక్కువ అన్వేషణలుంటే లాభాలు పంచుకోనక్కర్లేదు

12 Mar, 2019 01:14 IST|Sakshi

ఆయిల్, గ్యాస్‌ అన్వేషణ  విధానంలో మార్పులు 

మరిన్ని పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రభుత్వ నిర్ణయం 

న్యూఢిల్లీ: దేశీయంగా గ్యాస్, చమురు ఉత్పత్తి పెంపు దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తక్కువ నిల్వలున్న క్షేత్రాల నుంచి  చేసే ఉత్పత్తిలో ఎటువంటి లాభాలను ప్రభుత్వంతో పంచుకోవక్కర్లేదు. ఈ దిశగా కేంద్రం నిర్ణయం తీసుకుంది. తద్వారా ఈ విభాగంలోకి మరిన్ని ప్రైవేటు, విదేశీ పెట్టుబడులను ఆకర్షించొచ్చని భావిస్తోంది. రెండున్నర దశాబ్దాలుగా అన్ని రకాల అవక్షేపాల బేసిన్లకు ఒకే విధమైన కాంట్రాక్టు విధానాన్ని అనుసరిస్తుండగా, దానికి ప్రభుత్వం చమరగీతం పాడింది. దీంతో నూతన విధానంలో ఇప్పటికే వాణిజ్య ప్రాతిపదికన ఉత్పత్తి జరుగుతున్న క్షేత్రాలకు, ఉత్పత్తి ఆరంభించాల్సిన వాటికి భిన్నమైన నిబంధనలు వర్తిస్తాయి.

కేటగిరీ–1 పరిధిలో ఇప్పటికే ఉత్పత్తి జరుగుతున్న కృష్ణా గోదావరి, ముంబై ఆఫ్‌షోర్, రాజస్థాన్, అసోం క్షేత్రాల నుంచి జరిగే ఉత్పత్తి ద్వారా వచ్చే ఆదాయంలో ప్రభుత్వంతో వాటాను పంచుకోవాల్సి ఉంటుంది. నేలపై, సముద్రంలో తక్కువ లోతులోని బ్లాకుల నుంచి నాలుగేళ్లలోపే ఉత్పత్తిని ఆరంభించినట్టయితే, సముద్రంలో మరింత లోతుల్లో ఉన్న బ్లాకుల నుంచి ఉత్పత్తిని కాంట్రాక్టు కుదిరిన నాటి నుంచి ఐదేళ్ల లోపు ప్రారంభిస్తే రాయితీ రేట్లు అమలవుతాయని ప్రభుత్వ నోటిఫికేషన్‌ పేర్కొంది. భవిష్యత్తు బిడ్డింగ్‌ నుంచి ఏ బేసిన్లు అన్న దానితో సంబంధం లేకుండా ఉత్పత్తి దారులకు పూర్తి మార్కెటింగ్, ధరల స్వేచ్ఛ ఉంటుందని స్పష్టం చేసింది.    

మరిన్ని వార్తలు