సుకన్య సమృద్ధి పథకంలో మార్పులు

23 Jul, 2018 01:04 IST|Sakshi

ఏడాదికి కనీస జమ రూ.250కు తగ్గింపు

న్యూఢిల్లీ: ఆడ పిల్లల పేరిట పొదుపునకు ఉపకరించే సుకన్య సమృద్ధి యోజన పథకంలో కేంద్రం వార్షిక కనీస డిపాజిట్‌ను రూ.250కు తగ్గించింది. గతంలో ఇది రూ.1,000గా ఉండేది. ఖాతా ప్రారంభంలో కనీస డిపాజిట్‌ను రూ.250 చేయడమే కాకుండా, ఆ తర్వాత నుంచి వార్షికంగా రూ.250 కనీస డిపాజిట్‌గా నిర్ణయిస్తూ కేంద్రం పథకంలో మార్పులు చేసింది.

2017 నవంబర్‌ నాటికి 1.26 కోట్ల ఖాతాలు ఈ పథకం కింద ప్రారంభమయ్యాయని, రూ.19,183 కోట్ల మొత్తం ఆయా ఖాతాల్లో డిపాజిట్‌ చేయడం జరిగిందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ 2018 బడ్జెట్‌ సందర్భంగా ప్రకటించిన విషయం గమనార్హం. జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికానికి ఈ పథకం డిపాజిట్లపై వడ్డీ రేటు 8.1%గా ఉంది. 

పదేళ్ల లోపు ఆడపిల్లల పేరిట తల్లిదండ్రులు, గార్డియన్‌ ఈ ఖాతాను పోస్టాఫీసు లేదా ఎంపికచేసిన బ్యాంకుల్లోనూ తెరవవచ్చు. చిన్న మొత్తాల పొదుపు, పీపీఎఫ్‌ స్కీముల్లానే ఈ డిపాజిట్‌పై వడ్డీ రేటును ప్రతీ త్రైమాసికానికి ఒకమారు సవరిస్తారు. ప్రస్తుతం ఈ డిపాజిట్‌పై వడ్డీ రేటు 8.1% ఉంది. ఈ ఖాతాలో చేసే డిపాజిట్‌కు, డిపాజిట్‌ కాలం పూర్తయిన తర్వాత పొందే మొత్తానికి ఆదాయపు పన్ను చట్టం 80సీసీ కింద పూర్తి మినహాయింపు లభిస్తుంది. 

మరిన్ని వార్తలు