‘ఐటీ’ పెంపుతోనే చౌక సేవలు..

24 Oct, 2015 01:08 IST|Sakshi
‘ఐటీ’ పెంపుతోనే చౌక సేవలు..

- బ్యాంకింగ్ రంగంలో ఐటీ వినియోగానికి మరింత అవకాశం
- త్వరలోనే ఐటీకోసం ప్రత్యేక సబ్సిడరీ సంస్థ ఏర్పాటు
- 11వ ఐడీఆర్‌బీటీ సమావేశంలో ఆర్‌బీఐ గవర్నర్ రాజన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వినియోగం ద్వారా బ్యాంకులు వ్యయ నియంత్రణ చేసుకొని ఖాతాదారులకు చౌకగా సేవలను అందించడానికి అపారమైన అవకాశాలున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొంది. ఇప్పటికే బ్యాంకులు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని వినియోగిస్తున్నా,.. దానికి తగ్గట్టుగా ఖాతాదారులకు చౌక సేవలు అందుబాటులోకి రాలేదని ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే ఇప్పటికీ దేశీయ బ్యాంకింగ్ రంగంలో ఐటీ వినియోగం చాలా తక్కువగా ఉందని, దీన్ని మరింత పెంచుకోవడానికి అపార అవకాశాలున్నాయన్నారు.

సోషల్ నెట్‌వర్కింగ్, ఇతర మాధ్యమాల ద్వారా వచ్చే సమాచారాన్ని విశ్లేషించడం (బిగ్‌డేటా) ద్వారా ఖాతాదారుడికి అవసరమైన సేవలు, పథకాలను చౌకగా వారి ఇంటిముందునే అందించొచ్చన్నారు. ఐడీఆర్‌బీటీ 11వ బ్యాంకింగ్ టెక్నాలజీ ఎక్సలెన్స్ అవార్డుల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజన్ మాట్లాడుతూ బ్యాంకింగ్ రంగంలో సురక్షితమైన ఐటీ వినియోగాన్ని పెంచడానికి ప్రత్యేకంగా ఒక సబ్సిడరీని ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు తెలిపారు. సోషల్ మీడియా ద్వారా వస్తున్న సమాచారాన్ని రోజూ విశ్లేషించి తదనుగుణంగా పథకాలను రూపొందించే వ్యవస్థ ఇంకా బ్యాంకుల వద్ద లేదన్నారు. బిగ్‌డేటా, డేటా ఎనలిటిక్స్‌తో చౌక సేవలను ఎలా అందించాలన్న దానిపై బ్యాంకులు దృష్టిపెట్టాలన్నారు. ఆధార్ కార్డుతో అనేక ప్రయోజనాలున్నాయని, వీటి వినియోగానికి సుప్రీం కోర్టు అనుమతిస్తుం దన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

దేశంలో స్మార్ట్‌ఫోన్ల వినియోగం పెరుగుతున్నా దానికి అనుగుణంగా బ్యాంకింగ్ లావాదేవీలు పెరగడం లేదన్నారు. ఇప్పటికీ చాలా బ్యాంకులు సంప్రదాయ విధానాలనే అనుసరిస్తున్నాయని, కొత్తగా వచ్చే పేమెంట్, చిన్న బ్యాంకుల నుంచి ఇవి సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుందన్నారు. ఏడు విభాగాల్లో అత్యుత్తమ పనితీరు కనపర్చిన లార్జ్, మీడియం, స్మాల్ బ్యాంకులకు రాజన్ అవార్డులను అందచేశారు. కార్యక్రమంలో ఐడీఆర్‌బీటీ చైర్మన్, ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ హెచ్‌ఆర్ ఖాన్, ఐడీఆర్‌బీటీ డెరైక్టర్ ఎ.ఎస్.శాస్త్రితో పాటు వివిధ బ్యాంకుల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు