టీసీఎస్‌కు 'వరద దెబ్బ'.. షేర్లు పతనం!

14 Dec, 2015 17:53 IST|Sakshi

చెన్నై: దేశంలోనే అతిపెద్ద ఔట్‌సౌర్సింగ్‌ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌)కు చెన్నై వరద దెబ్బ గట్టిగానే తాకినట్టు కనిపిస్తున్నది. ఇటీవలి వరదబీభత్సం కారణంగా డిసెంబర్‌ నెలతో ముగిసే త్రైమాసికానికి సంస్థ ఆదాయం తగ్గే అవకాశముందని టీసీఎస్‌ ప్రకటించింది. దీంతో స్టాక్‌మార్కెట్‌లో టీసీఎస్‌ షేర్లు పతనం బాటా పట్టాయి. సోమవారం నాడే టీసీఎస్‌ షేర్‌ విలువ 2.3శాతం పడిపోయింది. టీసీఎస్‌కు చెన్నై అతిపెద్ద డెలివరీ లోకేషన్‌. ఇక్కడ 65వేల సిబ్బంది పనిచేస్తున్నారు. సంస్థ సిబ్బందిలో వీరు దాదాపు 20శాతం.  

'తీవ్ర వాతావరణ పరిస్థితులు, ఆ తర్వాత తలెత్తిన వరదలతో అత్యంత ప్రధానమైన కార్యకలాపాలు మినహాయించి డిసెంబర్ 1 నుంచి నగరంలో మన సంస్థ సాధారణ వ్యాపార కార్యకలాపాలు నిలిచిపోయాయి. డిసెంబర్ 7 నుంచి సంస్థలో వ్యాపార కార్యకలాపాలు పునఃప్రారంభించినప్పటికీ సిబ్బంది హాజరు మాత్రం సాధారణం కంటే తక్కువగా ఉంది. దీని ప్రభావం భౌతికంగా కంపెనీ ఆదాయం ఉండనుంది' అని టీసీఎస్‌ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. చెన్నైలో వర్షాలు, వరదల కారణంగా ఐదురోజులపాటు కలిగిన అంతరాయం వల్ల టీసీఎస్ మూడో త్రైమాసికంలో 60 పాయింట్ల వరకు క్వార్టర్‌ టు క్వార్టర్‌ ఇంపాక్ట్‌ ఉంటుందని పరిశీలక సంస్థ నొమురా పేర్కొంది. అదేవిధంగా స్టాక్‌మార్కెట్‌లో టీసీఎస్‌ వాటాల లక్షిత ధరను రూ. 2,670 నుంచి 2,500 లకు తగ్గించింది.

మరిన్ని వార్తలు