చేతక్‌ ఎలక్ట్రిక్‌ @ రూ. లక్ష 

15 Jan, 2020 02:56 IST|Sakshi

బుకింగ్‌ రుసుము రూ. 2000 

ఆన్‌లైన్‌లోనూ అవకాశం... 

ఫిబ్రవరి నెలాఖరు నుంచి డెలివరీలు 

ముంబై: ప్రముఖ వాహన తయారీ కంపెనీ బజాజ్‌ ఆటో ఒకప్పటి తన ఐకానిక్‌ స్కూటర్‌ ‘చేతక్‌’ను మళ్లీ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. నూతన తరానికి తగిన విధంగా ఈసారి ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను విడుదలచేసింది. ఈ–స్కూటర్‌ ప్రారంభ ధర రూ. లక్ష కాగా, ఎలక్ట్రిక్‌ స్కూటర్లకు ప్రభుత్వం ఇస్తోన్న సబ్సిడీలు పోనూ ఇది ఎక్స్‌–షోరూం ధరని కంపెనీ వివరించింది. అంటే, రోడ్‌ ట్యాక్స్, బీమా కలపని ధర ఇది.

డిస్క్‌ బ్రేక్‌లు, లగ్జరీ ఫినిషింగ్‌ కలిగిన ప్రీమియం ఎడిషన్‌ ధర రూ. 1.15 లక్షలుగా ఉంది. ఒక్కసారి చార్జ్‌ చేస్తే 95 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలిగే చేతక్‌ ఎలక్ట్రిక్‌ బుకింగ్స్‌ సంక్రాంతి పండుగ రోజే (నేటి నుంచి) ప్రారంభంకానున్నాయి. సంస్థ వెబ్‌సైట్‌ ద్వారా ఈ ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేయవచ్చని, ఇందుకు ఇనీషియల్‌ అమౌంట్‌ కింద రూ. 2,000 చెల్లించాల్సి ఉంటుందని కంపెనీ ప్రకటించింది. ఫిబ్రవరి నెలాఖరు నుంచి డెలివరీలు ప్రారంభిస్తామని సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రాకేశ్‌ శర్మ వెల్లడించారు.  

మూడేళ్ల వారంటీ..: ఈ–స్కూటర్‌కు ఏడాదికి ఒకసారి లేదంటే.. 12,000 కిలోమీటర్లు తిరిగిన ప్రతిసారీ కనీస నిర్వహణ అవసరమని కంపెనీ పేర్కొంది. కస్టమర్లకు  50,000 కిలోమీటర్ల వరకు లేదంటే, మూడేళ్లు ఏది ముందైతే అది వారంటీగా లభిస్తుంది. లిథియం–అయాన్‌ బ్యాటరీకి కూడా వారంటీ వర్తిస్తుంది.  

అతి నియంత్రణ వల్లే రేట్ల పెంపు.. 
ఏడాదిన్నరలో 30% పెరగనున్న ద్విచక్ర వాహనాల ధరలు 
బడ్జెట్‌పై పెద్దగా ఆశల్లేవు: బజాజ్‌ ఆటో ఎండీ రాజీవ్‌ బజాజ్‌  

ఏడాదిన్నర వ్యవధిలో ద్విచక్ర వాహనాల ధరలు 30 శాతం మేర పెరగనున్నాయని బజాజ్‌ ఆటో ఎండీ రాజీవ్‌ బజాజ్‌ వెల్లడించారు. మార్కెట్లను ’అతిగా నియంత్రించడమే’ ఇందుకు కారణమని ఆయన వ్యాఖ్యానించారు. కొత్త ఉద్గార నిబంధనల అమలు ప్రభావం తదితర నియంత్రణపరమైన అంశాలను బజాజ్‌ ఉదహరించారు. చేతక్‌ స్కూటర్‌ ఎలక్ట్రిక్‌ వెర్షన్‌ను లాంఛనంగా ఆవిష్కరించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు.

కొత్తగా భారత్‌ స్టేజ్‌–6 ప్రమాణాలకు అనుగుణంగా వాహనాలను తయారు చేయాల్సి రానుండటంతో స్టేజ్‌–4 తో పోలిస్తే రేట్లు మరింత పెంచాల్సి వస్తుందంటూ ఆటోమొబైల్‌ సంస్థలు చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బజాజ్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు, విద్యుత్‌ వాహనాలపై వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ)ని 5 శాతంగా కేంద్రం నిర్ణయించినప్పటికీ.. కంబషన్‌ ఇంజిన్‌ వాహనాలపై 28 శాతం కొనసాగుతోందని బజాజ్‌ చెప్పారు. దీన్ని 18 శాతానికైనా తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం ఆటోమొబైల్‌ పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించే అంశాలేవీ బడ్జెట్‌లో ఉంటాయని తానేమీ ఆశించడం లేదని బజాజ్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు