పన్ను వివాదాలకు సత్వర పరిష్కారం చూపాలి 

25 Jan, 2020 04:51 IST|Sakshi

అది పన్ను చెల్లింపుదారులకు ప్రోత్సాహకరం...

వివాదంలో ఉన్న నిధులకు విముక్తి

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బాబ్డే వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: పన్ను వివాదాలకు వేగంగా పరిష్కారం చూపించాలని, అలా చేస్తే అది పన్ను చెల్లింపుదారులకు ప్రోత్సాహకంగా మారుతుందని, వివాదంలో ఉన్న నిధులకు విముక్తి కలుగుతుందన్నారు సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే. దేశ వనరుల సమీకరణలో పన్నుల న్యాయ వ్యవస్థ పాత్ర కీలకమైనదని పేర్కొంటూ, పెండింగ్‌ కేసులపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆదాయపన్ను అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ 79వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమం శుక్రవారం ఢిల్లీలో జరిగింది.

దీనికి చీఫ్‌ జస్టిస్‌ హాజరై మాట్లాడారు. పరోక్ష పన్నులకు సంబంధించి సుప్రీంకోర్టు, హైకోర్టులు, సీఈఎస్‌టీఏటీలోని పెండింగ్‌ కేసుల్లో 61%(1.05 లక్షల కేసులకు) గత రెండేళ్ల కాలంలో తగ్గించామని చెప్పారు. పన్నుల ఎగవేతను తోటి పౌరులకు చేసే సామాజిక అన్యాయంగా పేర్కొన్నారు. అదే విధంగా ఏకపక్షమైన, అధిక పన్ను విధింపు అన్నది ప్రభుత్వం ద్వారా సామాజిక అన్యాయానికి దారితీస్తుందన్నారు. తేనెటీగలు పువ్వులకు హాని చేయకుండా మకరందాన్ని తోడుకున్నట్టుగానే, ప్రజల నుంచి పన్నులను రాబట్టాలని సూచించారు.

న్యాయ ప్రక్రియలోనూ ఏఐ 
న్యాయ వ్యవస్థలో కృత్రిమ మేధ (ఏఐ) అవసరాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బాబ్డే ప్రస్తావించారు. ముఖ్యంగా వేగవంతమైన పరిష్కారం, ఒకే తరహా కేసుల పునరావృతం, డాక్యుమెంట్ల నిర్వహణలో ఏఐ అవసరపడుతుందన్నారు. అదే సమయలో ఏఐ అన్నది మానవ ప్రమేయాన్ని పూర్తి స్థాయిలో భర్తీ చేయలేదన్నారు.

మరిన్ని వార్తలు