చైనా ఎగుమతులు, దిగుమతులు ఢమాల్!

8 May, 2016 17:56 IST|Sakshi
చైనా ఎగుమతులు, దిగుమతులు ఢమాల్!

బీజింగ్ : రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా పేరున్న చైనాలో ఏప్రిల్ నెల ఎగుమతులు, దిగుమతులు పడిపోయాయి. అంచనాల కంటే చాలా  తక్కువగా ఎగుమతులు, దిగుమతులు నమోదయ్యాయి. అంతకముందు ఏడాదితో పోలిస్తే ఎగుమతులు 1.8శాతం పడిపోగా, దిగుమతులు 10.9శాతం పతనమయ్యాయని కస్టమ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. వరుసగా 18సార్లు చైనాలో దిగుమతులు కిందకు జారాయి. దేశీయంగా డిమాండ్ ఆందోళనకరంగా ఉండటంతో దిగుమతులు పతనమయ్యాయని, కానీ మౌలిక సదుపాయాల కల్పన, మొదటి త్రైమాసికంలో రికార్డు రుణవృద్ధి ఉండటంతో చైనా ఆర్థికవ్యవస్థ మెల్లగా కోలుకుంటున్నదని కస్టమ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆశాభావం వ్యక్తంచేసింది.

విదేశాల్లో కూడా చైనా ఉత్పత్తులకు డిమాండ్ పడిపోవడంతో ఎగుమతులు తగ్గినట్టు వెల్లడించింది. చైనాకు అతిపెద్ద మార్కెట్ గా ఉన్న అమెరికాకు గతేడాది కంటే ఈ ఏడాది ఎగుమతులు 9.6శాతం తగ్గాయని తెలిపింది. అయితే, చైనాకు రెండో అతిపెద్ద మార్కెట్ యూరోపియన్ యూనియన్ కు 3.2శాతం ఎగుమతులు పెరిగాయని గణాంకాలు విడుదలచేసింది. ఎగుమతులు 0.1శాతం, దిగుమతులు 5శాతం పడిపోతాయని మార్కెట్ ఆర్థిక నిపుణులు అంచనావేశారు. వారి అంచనాలకంటే ఎక్కువగా ఇవి నమోదయ్యాయి. చైనా ఉత్పత్తుల ఎగుమతులు పెంచడానికి, బ్యాంకు రుణాలను ప్రోత్పహించడం, ఎగుమతుల క్రెడిట్ ఇన్సూరెన్స్ పెంచడం, కొన్ని సంస్థలకు పన్ను మినహాయింపులు పెంచడం వంటి చర్యలను ఆ దేశ ప్రభుత్వం తీసుకుంటోంది. ప్రపంచ ఆర్థిక సంక్షోభం వల్ల చైనా ఆర్థిక వృద్ధి 6.7శాతంగా నమోదైనట్టు గణాంకాలు తెలిపాయి.

మరిన్ని వార్తలు