అంబానీకి దెబ్బమీద దెబ్బ

28 Nov, 2017 20:17 IST|Sakshi

సాక్షి,ముంబయి:  అనిల్‌ ధీరూబాయి అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌కు దెబ్బమీద దెబ్బ పడుతోంది. భారీ అప్పులతో సంక్షోభంలో పడిపోయిన ఆర్‌కాంపై  చైనా డెవలప్‌మెంట్‌ బ్యాంకు  (సీడీబీ)  కేసు ఫైల్‌  చేసింది.  భారీ రుణాలను  చెల్లించడంలో ఆర్‌కాం విఫలం కావడంతో సీడీబీ ఈ నిర్ణయం తీసుకుంది. సుమారు రూ.11,593 కోట్ల  మేర ఇన్‌ సాల్వెన్సీ కేసు దాఖలు  చేసినట్టు  బ్యాంకు ప్రకటించింది. ఈ మేరకు ఆర్‌కాంకు నోటీసులు పంపినట్టు తెలిపింది.

రిలయన్స్‌కమ్యూనికేషన్స్‌కు 1.78 బిలియన్ డాలర్ల రుణాన్ని ఇచ్చిన చైనా డెవలప్‌మెంట్ బ్యాంక్, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) ముంబయి బెంచ్ లో  దావా వేసింది. ఇప్పటికే రుణ పరిష్కారంపై పనిచేస్తున్న భారతీయ  రుణదాతలు తమ పిటిషన్‌ను వ్యతిరేకించే అవకాశం ఉందని  సీడీబీ వర్గాలు  అంచనా వేశాయి.  ఈ వార్తలతో మంగళవారం నాటి మార్కెట్లో  ఆర్‌కాం కౌంటర్‌ భారీగా నష్టపోయింది.

దివాలా నియమావళి (ఐబిసి) ప్రకారం, ఒక సంస్థపై  ఎన్‌సీఎల్‌టీకి ఫిర్యాదు చేస్తే.. ఆ ఫిర్యాదును కోర్టు సానుకూలంగా స్వీకరిస్తే.. ప్రొఫెషనల్ పరిష్కార కమిటీనీ ఏర్పాటు చేయనుంది. దీంతోపాటు ఆర్‌కాం డైరెక్టర్ల బోర్డును రద్దు చేస్తుంది.  అనంతరం ఈ కంపెనీ ఆర్‌కాం ఆస్తుల  వేలానికి పిలుపునిచ్చే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు ఈ వార్తలపై ఆర్‌కామ్‌ వివరణ ఇచ్చింది. చైనా డెవలప్‌మెంట్‌ బ్యాంకు దరఖాస్తు చేసినట్టు ట్రైబ్యునల్‌ నుంచి తమకు ఎలాంటి నోటీసులు అందలేదని పేర్కొంది.

మరిన్ని వార్తలు