కౌంటర్‌ : ట్రంప్‌కు చైనా దెబ్బ పడింది

2 Apr, 2018 11:03 IST|Sakshi
అమెరికాపై చైనా కౌంటర్‌ ఎటాక్‌ (ప్రతీకాత్మక చిత్రం)

బీజింగ్‌ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు చైనా గట్టి షాకిచ్చింది. అల్యూమినియం, స్టీల్‌ దిగుమతులపై అమెరికా విధించిన డ్యూటీలకు కౌంటర్‌గా, అమెరికా ఉత్పత్తులపై చైనా అదనపు టారిఫ్‌లు విధించింది. 128 అమెరికా ఉత్పత్తులపై అదనంగా 25 శాతం వరకు టారిఫ్‌ విధిస్తున్నట్టు చైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది. దీనిలో పంది మాంసం, వైన్‌, కొన్ని పండ్లు, నట్స్‌ ఉన్నాయి. టారిఫ్‌లు విధించిన 3 బిలియన్‌ డాలర్ల అమెరికా ఉత్పత్తుల జాబితాను విడుదల చేస్తున్నట్టు చైనా సోమవారం ప్రకటించింది. 120 అమెరికా ఉత్పత్తులపై టారిఫ్‌లు తగ్గించే బాధ్యతలను పక్కనపెట్టిన చైనా, ఒకేసారి వాటిపై మరో 15 శాతం టారిఫ్‌ అదనంగా విధిస్తున్నట్టు పేర్కొంది. పంది మాంసం వంటి మరో ఎనిమిది ఉత్పత్తులపై అదనంగా 25 శాతం వరకు టారిఫ్‌లను విధిస్తామని వెల్లడించింది. ఈ నిర్ణయం నేటి నుంచే అమల్లోకి రానున్నట్టు కూడా తెలిపింది. 

అమెరికా దిగుమతులపై టారిఫ్‌ మినహాయింపును రద్దు చేయడం, డబ్ల్యూటీవో నిబంధనలు వాడుకుని చైనా ప్రయోజనాలను కాపాడుకోవడమేనని బీజింగ్‌ సమర్థించుకుంటోంది. చైనా విధించిన ఈ అదనపు టారిఫ్‌లు బీజింగ్‌కు, వాషింగ్టన్‌కు మధ్య ట్రేడ్‌వార్‌ ఆందోళనలను మరింత రేకెత్తిస్తున్నాయి. ఆర్థికంగా బలమైన రెండు పెద్ద దేశాల మధ్య  ఈ యుద్ధం ఏ మలుపు తిప్పుతుందో అని ప్రపంచ దేశాలన్నీ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు స్టీల్‌, అల్యూమినియం ఉత్పత్తులపై అమెరికా దిగుమతి సుంకాలు విధించిన తర్వాత కూడా.. మరో 50 బిలియన్‌ డాలర్లకు పైగా టారిఫ్‌లను చైనీస్‌ వస్తువులపై విధించాలని ట్రంప్‌ ప్లాన్‌ చేస్తున్నారు. అమెరికా మేథోసంపత్తి హక్కులను చైనా దుర్వినియోగ పరుస్తుందని, ఈ మేరకు బీజింగ్‌ను శిక్షించాల్సి ఉందని ట్రంప్‌ హెచ్చరిస్తూ ఉన్నారు. అయితే ఈ ఆరోపణలు బీజింగ్‌ ఖండిస్తోంది.  

>
మరిన్ని వార్తలు