చర్చలైనా, యుద్ధమైనా సై

3 Jun, 2019 05:55 IST|Sakshi

అమెరికాతో వాణిజ్య వివాదంపై చైనా స్పష్టీకరణ

సింగపూర్‌: వాణిజ్య అంశాలపై అమెరికా, చైనాల మధ్య పోరు మరింత రసవత్తరంగా మారుతోంది. ఈ విషయంలో అమెరికాతో చర్చలకైనా, యుద్ధానికైనా తాము సిద్ధంగా ఉన్నామని చైనా స్పష్టం చేసింది. చర్చలకు ఇప్పటికీ తాము సిద్ధమేనని, కానీ ఒకవేళ అమెరికా గానీ యుద్ధమే కోరుకుంటే తుదిదాకా పోరాడతామని హెచ్చరించింది. సింగపూర్‌లో ఐఐఎస్‌ఎస్‌ షాంగ్రి–లా సదస్సుకు హాజరైన సందర్భంగా చైనా రక్షణ మంత్రి జనరల్‌ వై ఫెంగీ ఈ విషయాలు చెప్పారు. ‘అమెరికా మొదలుపెట్టిన వాణిజ్య వివాదం విషయానికొస్తే.. అమెరికా కోరుకుంటే మేమూ చర్చలకు సిద్ధమే. కాదూ.. యుద్ధం చేయదల్చుకుంటే దానికి కూడా సిద్ధమే‘ అని ఆయన చెప్పారు. మరోవైపు, దేశభద్రత పేరిట చైనా టెలికం కంపెనీ హువావేపై అమెరికా ఆంక్షలు విధించడం అర్ధరహితమన్నారు.

ఆ సంస్థ యజమాని మాజీ సైనికాధికారి అయినంత మాత్రాన అది మిలిటరీ కంపెనీ కాదని ఫెంగీ వ్యాఖ్యానించారు. 539 బిలియన్‌  డాలర్ల పైగా ఉన్న వాణిజ్య లోటును భర్తీ చేయాలంటూ చైనా మీద అమెరికా ఒత్తిడి తెస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 250 బిలియన్‌  డాలర్ల విలువ చేసే చైనా దిగుమతులపై అమెరికా ప్రభుత్వం ఇటీవలే సుంకాలు పెంచింది. ప్రతిగా చైనా కూడా 60 బిలియన్‌  డాలర్ల విలువ చేసే అమెరికన్‌  దిగుమతులపై టారిఫ్‌లు పెంచింది. ఇరు దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధాలు ప్రపంచ మార్కెట్లను కలవరపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫెంగీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆసియా–పసిఫిక్‌ ప్రాంత దేశాల మధ్య బంధాలు మెరుగుపర్చుకునేందుకు తీసుకోతగిన చర్యల గురించి చర్చించడం ఈ సదస్సు ప్రధానోద్దేశం.  

అమెరికా ఎకానమీకే నష్టం..
అమెరికా తెరతీసిన వాణిజ్య యుద్ధంతో ఆ దేశానికి ఒనగూరిందేమీ లేకపోగా.. ఆ దేశ ఎకానమీకే  ఎక్కు వగా నష్టం జరుగుతోందని చైనా ప్రభుత్వం వ్యాఖ్యానించింది. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవడానికి తాము సిద్ధంగానే ఉన్నామని, అయితే సిద్ధాంతాల విషయంలో మాత్రం రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. తమ ఉత్పత్తులపై అమెరికా సుంకాలు విధించిన దరిమిలా తాజాగా విడుదల చేసిన శ్వేతపత్రంలో ఈ అంశాలు పేర్కొంది. చైనా ఉత్పత్తులపై అమెరికా టారిఫ్‌లు విధించడం వల్ల అగ్రరాజ్యంలో ఉత్పత్తి వ్యయాలు, ఉత్పత్తుల ధరలు పెరిగిపోయాయని.. ఫలితంగా ఆ దేశ ఆర్థిక వృద్ధికి ప్రమాదకరంగా మారాయని చైనా వ్యాఖ్యానించింది.
 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు